Bumrah Asia Cup: ప్రతిష్టాత్మక ఆసియా కప్‌కు ముందు టీమ్ఇండియాకు పెద్ద షాక్ తగిలింది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ఈ టోర్నీకి దూరమయ్యాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆసియా కప్ కోసం భారత జట్టును సోమవారమే ఎంపిక చేయనుంది సెలక్షన్ కమిటీ. అయితే.. జట్టును ఇవాళే ప్రకటిస్తారా లేదా అనేది స్పష్టత లేదు. గాయం తీవ్రతరం కాకుండా.. బుమ్రా టీ-20 వరల్డ్‌కప్ వరకు సిద్ధంగా ఉండేందుకే విశ్రాంతిని ఇస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు.
''జస్ప్రీత్ బుమ్రా వెన్నుగాయంతో బాధపడుతున్నాడు. అతడు ఆసియా కప్‌లో ఆడటం లేదు. బుమ్రా.. మా ప్రధాన బౌలర్. టీ-20 వరల్డ్ కప్‌లో అతడు కచ్చితంగా జట్టులో ఉండాలి. అందుకే ఆసియా కప్‌లో ఆడించి మేం రిస్క్ చేయదల్చుకోలేదు. ఒకవేళ ఆడిస్తే.. గాయం తీవ్రతరం కావొచ్చు.''
- బీసీసీఐ సీనియర్ అధికారి