తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ దిగ్గజ బ్యాటర్​ను అప్పట్లో రెండు, మూడు సార్లు బౌల్డ్‌ చేశా' - పాటింగ్​

Bumrah Bowled Ricky Ponting: ఐపీఎల్​ తొలినాళ్లలోనే బ్యాటింగ్​ దిగ్గజం రికీ పాంటింగ్​ను రెండు మూడుసార్లు బౌల్డ్​ చేసినట్లు తెలిపాడు ముంబయి ఇండియన్స్​ పేసర్​ జస్ప్రీత్​ బుమ్రా. తాజాగా రవిచంద్రన్‌ అశ్విన్‌ యూట్యూబ్‌ ఛానల్​లో మాట్లాడిన బుమ్రా మరిన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు.

Jasprit Bumrah
Jasprit Bumrah

By

Published : Feb 28, 2022, 8:28 PM IST

Bumrah Bowled Ricky Ponting: ముంబయి ఇండియన్స్‌లోకి వచ్చిన తొలినాళ్లలోనే బ్యాటింగ్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ను రెండు, మూడు సార్లు బౌల్డ్‌ చేశానని ఆ జట్టు ప్రధాన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా చెప్పుకొచ్చాడు. తాజాగా అతడు రవిచంద్రన్‌ అశ్విన్‌ యూట్యూబ్‌ ఛానల్​లో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2013లో ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున అరంగేట్రం చేసిన అతడు తర్వాత ఆ జట్టులో కీలక పేసర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలోనే 2013లో తొలిసారి ఆ జట్టులో చేరినప్పటి విశేషాలను ఇలా పంచుకున్నాడు.

'2013లో నేను ముంబయి ఇండియన్స్‌కు ఎంపికైనప్పుడు తొలి మ్యాచ్‌లో ఆడలేకపోయా. ఆ సమయంలో నేనూ, అక్షర్ పటేల్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఆడుతుండటంతో ఆలస్యంగా జట్టు క్యాంప్‌లో చేరాం. దీంతో మేం తొలి గేమ్‌ ఆడలేకపోయాం. అప్పటికే ముంబయి టీమ్‌ బెంగళూరులో సాధన మొదలు పెట్టింది. మేం వెళ్లాక రెండు రోజులే జట్టుతో ప్రాక్టీస్‌ చేశాం. అక్కడి మైదానంలో పచ్చిక ఉండటంతో బంతి బాగా స్వింగ్‌ అయ్యేది. ఈ క్రమంలోనే నేను కొత్త బంతితో ప్రాక్టీస్‌ చేస్తూ అందరికీ స్వింగర్లు వేసి ఇబ్బంది పెట్టాను. చివరికి రికీ పాంటింగ్‌కు కూడా బౌలింగ్‌ చేసి రెండు, మూడు సార్లు బౌల్డ్‌ చేశాను. అప్పుడు ప్రధానంగా ఇన్‌స్వింగర్లే వేసేవాడిని. అప్పుడు నా బౌలింగ్‌లో ఏదో ప్రత్యేకత ఉందని పాంటింగ్‌, జట్టు యాజమాన్యం భావించి తుది జట్టులో ఆడిద్దామని నిర్ణయించుకున్నారు' అని బుమ్రా తన అరంగేట్రం నాటి రోజుల్ని నెమరువేసుకున్నాడు.

ఇదీ చూడండి:టీమ్​ఇండియా మిడిల్​ ఆర్డర్​లో కొత్త శకం

ABOUT THE AUTHOR

...view details