Jasprit Bumrah on captaincy: టీమ్‌ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరిస్‌కు ముందు మీడియా సమావేశంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తనకు అప్పగిస్తే గొప్ప గౌరవంగా భావిస్తానన్నాడు. భవిష్యత్తులో అలాంటి ఛాన్స్ వస్తే ఏ ఆటగాడు కూడా వదులుకోడు అని చెప్పాడు.
టీమ్‌ఇండియా టెస్టు జట్టు కెప్టెన్గా తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించడం క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. అలాగే తదుపరి కెప్టెన్ ఎవరు అనే విషయంపై జోరుగా చర్చ మొదలైంది. రోహిత్ శర్మకు ఆ అవకాశం ఉన్నా.. వచ్చే ఏడాది అతడు 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాడు. దీంతో అతడు దీర్ఘకాలం కొనసాగటం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇదే విషయమై బుమ్రాను ఓ వార్తా సంస్థ అడగ్గా.. అతడు ఈ విధంగా బదులిచ్చాడు.
" ఒకవేళ టీంఇండియా కెప్టెన్సీ అవకాశం వస్తే గొప్ప గౌరవంగా భావిస్తా. ఛాన్స్ వస్తే ఏ ఆటగాడు కూడా వద్దని చెప్పడు. నేను కూడా అంతే. జట్టు నాయకుడిగా ఎవరు ఉన్నా.. నా శక్తిసామర్థ్యాల మేరకు నావంతు భాగస్వామ్యం అందిస్తా. ప్రస్తుత పరిస్థిని కూడా అలాగే చూస్తా. బాధ్యత తీసుకుని ఆటగాళ్లతో మాట్లాడటం, వారికి సాయం చేయడం నా పద్ధతి. ఇకముందు కూడా ఎలాంటి పరిస్థితిలోనైనా నా విధానంలో మార్పు ఉండదు."
-జస్ప్రీత్ బుమ్రా.
టెస్ట్ జట్టు కెప్టెన్గా తప్పుకోవడం కోహ్లీ వ్యక్తిగత విషయమని, దాన్ని అందరం గౌరవిస్తామని బుమ్రా తెలిపాడు. అతడు జట్టుకు అందించిన సేవలు మరువలేమన్నారు. తోటి ఆటగాళ్లలో ఎప్పుడూ జోష్ నింపడమే గాక, వాళ్లకు అన్ని విధాలుగా కోహ్లీ మద్దతుగా ఉంటాడని వివరించాడు. తన అరంగేట్రం కూడా కోహ్లీ సారథ్యంలోనే జరిగిందని గుర్తు చేసుకున్నాడు. కెప్టెన్గా వైదొలుగుతున్నట్లు టీమ్ మీటింగ్‌లోనే అతడు చెప్పాడని వెల్లడించాడు.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో కొల్పోయింది టీమ్ ఇండియా. మూడు వన్డేల సిరీస్ బుధవారం ప్రారంభమవుతుంది. రోహిత్ దూరం కావడం వల్ల ఈ సిరీస్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్గా, జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.