James Anderson 650th wicket: ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టామ్ లాథమ్‌ను పెవిలియన్ చేర్చిన అతడు.. కెరీర్లో 650వ వికెట్‌ను దక్కించుకున్నాడు. దీంతో ఈ ఫీట్ సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా నిలవగా.. అలానే ఇంగ్లీష్ జట్టు తరఫున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గానూ నిలిచాడు. మరోవైపు టెస్టుల్లో ఈ మార్క్‌ను అందుకున్న మూడో బౌలర్‌గానూ రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ముత్తయ్య మురళీధరన్(800), షేన్ వార్న్(708) రెండో స్థానంలో ఉన్నాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 539 పరుగులకు ఆలౌట్ అయింది. జో రూట్(176), ఓలీ పోప్(145) పరుగులతో రాణించారు. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 553 రన్స్‌కు ఆలౌట్ అవ్వగా.. జట్టులో మిచెల్(190), టామ్ బ్లండల్(106) మంచి ప్రదర్శన చేశారు. దీంతో 14 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ఫలితంగా 238 పరుగుల ముందంజలో ఉంది.