ఇటీవల మొతేరాతోప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించిన భారత్.. మరో భారీ క్రికెట్ మైదానానికి వేదిక కానుంది. 75 వేల మంది సీటింగ్ సామర్థ్యంతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రికెట్ స్టేడియం రాజస్థాన్‌లో నిర్మించనుంది. జైపూర్‌లో ఈ స్టేడియం అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు రాజస్థాన్ క్రికెట్ సంఘానికి (ఆర్సీఏ) రూ.100 కోట్ల గ్రాంట్ అందించనుంది బీసీసీఐ. అహ్మదాబాద్‌లోని మొతేరా, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ తర్వాత అతిపెద్ద స్టేడియం ఇదే కానుంది!
స్టేడియం నిర్మాణానికి ఇప్పటికే 100 ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకుంది ఆర్సీఏ. నిర్మాణ వ్యయం రూ.350 కోట్ల వరకు ఉంటుందని అంచనా. జైపూర్ శివారులో చోప్ గ్రామంలో ఈ మైదానాన్ని ఏర్పాటు చేయనున్నారు. రూ.100 కోట్లను బ్యాంకు రుణాల ద్వారా సమకూర్చుకోనున్న ఆర్సీఏ.. కార్పొరేట్ బాక్స్‌ల విక్రయం ద్వారానూ నిధులను సమీకరించనుంది.