టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ(MS Dhoni) ఇచ్చిన సలహా తనకెంతో ఉపయోగపడిందని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Jadeja) అంటున్నాడు. షాట్ల ఎంపిక బాగా లేక ఇబ్బంది పడుతున్నప్పుడు షార్ట్‌పిచ్ బంతులు ఆడమని సూచించాడని చెప్పాడు. అంతకు ముందు షాట్ ఆడాలా వద్దా? ఏ షాట్ ఆడాలి? బంతిని వదిలేద్దామా?ఆడదామా? లాంటి ప్రశ్నలు మదిలో మెదిలేవని పేర్కొన్నాడు. దాంతో తికమక పడుతూ ఆడేవాడినని వెల్లడించాడు.
"ఏ బంతులు వదిలేయాలో అవే ఆడేందుకు ప్రయత్నిస్తున్నావని ధోనీ చెప్పాడు. నా షాట్ల ఎంపిక తప్పుగా ఉందని మొదట్నుంచీ నాకు అనిపిస్తూనే ఉంది. ఆరంభంలో నా అంచనా సరిగ్గా లేదు. షాట్ ఆడలా? వద్దా? అన్నట్టు ఆలోచించేవాడిని. ఇప్పుడు కావాల్సిన సమయం తీసుకుంటున్నా. స్పష్టంగా ఆలోచిస్తున్నా. ముందు నిలదొక్కుకుంటే తర్వాత పరుగులు చేయొచ్చని తెలుసు. ఆలోచనా విధానంలో ఆ మార్పు నాకిప్పుడు సాయపడుతోంది."
- రవీంద్ర జడేజా, టీమ్ఇండియా ఆల్‌రౌండర్
"బౌన్సర్ల గురించి చెప్పాలంటే.. అవును, షార్ట్‌పిచ్ బంతుల్ని సిక్సర్లుగా మలిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బౌన్సర్లతో నాకెప్పుడూ ఇబ్బంది అనిపించలేదు. ఎక్కువసార్లు ఔటైనట్టూ గుర్తులేదు. ఆడలేననీ నాకూ అనిపించలేదు. నా షాట్ల ఎంపిక, సమతూకం ముఖ్యమని అర్థమైంది" అని జడ్డూ తెలిపాడు. ప్రస్తుతం ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్(WTC final)తో పాటు ఇంగ్లాండ్ పర్యటనకు జడేజా సిద్ధమవుతున్నాడు.
ప్రస్తుతం రవీంద్ర జడేజా కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. బంతితో వికెట్లు తీస్తున్నాడు. బ్యాటుతో పరుగులు చేస్తున్నాడు. లోయర్ ఆర్డర్‌లో విధ్వంసకరంగా ఆడుతూ జట్టుకు భారీ స్కోర్లు అందిస్తున్నాడు. రెండేళ్లుగా జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడు. నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్(IPL)లోనూ అతడి మెరుపులు ఆకట్టుకున్నాడు. 2015 వన్డే ప్రపంచకప్(ICC world cup 2015) సమయంలో ధోనీ తనకు ఓ సలహా ఇచ్చాడని వెల్లడించాడు.
ఇదీ చూడండి:WTC Final: వారుండగా కోహ్లీపై ఒత్తిడేలా!