shreyas iyer father wattsup DP: కొడుకు విజయం సాధిస్తే ఏ తండ్రికైనా సంతోషమే. ఇప్పుడదే ఆనందంలో మునిగితేలుతున్నారు టీమ్ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తండ్రి సంతోష్. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మొదటి రోజు ఆట పూర్తయింది. ఈ మ్యాచ్‌లో టెస్టు అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్(75*) అందరి దృష్టిని ఆకర్షించి ప్రశంసలను పొందాడు(shreya iyer vs newzealand). ఈ క్రమంలోనే అతడి ఆటతీరుపై తన తండ్రి సంతోష్ హర్షం వ్యక్తం చేస్తూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. శ్రేయస్ ఫొటో ఉన్న తన వాట్సాప్ డీపీని నాలుగేళ్లగా మార్చలేదని చెప్పారు. ఆ ఫొటోలో శ్రేయస్ 2017 బోర్డర్ గావస్కర్ ట్రోఫీని పట్టుకుని ఉండటం విశేషం.
"ఈ డీపీ(శ్రేయస్.. బోర్డర్ గావాస్కర్ ట్రోఫీని పట్టుకుని దిగిన ఫొటో) అంటే నాకెంతో ఇష్టం. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కోహ్లీ స్థానంలో శ్రేయస్ స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్నాడు. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత జట్టు సభ్యులు, ట్రోఫీని అతడి చేతికి ఇచ్చారు. ఆ సమయం నాకెంతో ప్రత్యేకమైనది. టెస్టుల్లో నా కొడుకు ఎప్పుడు ఆడతాడా అని అప్పటినుంచి ఎదురుచూశాను. ఎప్పుడైతే రహానే.. శ్రేయస్ పేరును ప్రకటించాడో నాకు చాలా సంతోషమేసింది. ఎందుకంటే టెస్టు క్రికెట్ ఆడటం అతడి అంతిమ లక్ష్యం. నేను కూడా ఎప్పుడు దానిమీదే దృష్టి పెట్టమని చెప్పేవాడిని. త్వరలోనే అది జరిగి తీరుతుందని నాతో తను చెప్పేవాడు. ఇప్పుడు అది నిజమైంది. నాలుగేళ్ల నుంచి నా కొడుకు(ట్రోఫీ పట్టుకుని ఉన్న) ఫొటో ఉన్న డీపీ మార్చలేదు. అతడు ఈ ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నాను. శ్రేయస్‌కు ఇది మంచి అవకాశం. అతడు మంచి బ్యాటర్. సునీల్ గావస్కర్ నా ఫేవరెట్ క్రికెటర్. అతడి చేతుల మీదగా శ్రేయస్ క్యాప్ తీసుకోవడం గర్వంగా భావిస్తున్నాను. ఇది నాకు గొప్ప అనుభూతి. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను."