Ishan Kishan Replaces Virat Kohli :2024 టీ20 వరల్డ్‌కప్‌ను బీసీసీఐ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈ పొట్టి ప్రపంచకప్‌నకు మరో ఆరు నెలలే సమయం ఉండడం వల్ల, జట్టు కూర్పుపై మేనేజ్మెంట్ కసరత్తులు చేస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్యూచర్ గురించి అతడితో తాజాగా చర్చలు జరిపిన బీసీసీఐ, రానున్న పొట్టి ప్రపంచకప్‌నకు అతడే సారధిగా కొనసాగాలని కోరిందట.
అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం బీసీసీఐ, ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు విరాట్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. అయితే ఇప్పుడు విరాట్ కాకుండా, ఈ స్థానంలో ప్రత్యర్థులను అటాక్ చేసే మరో బ్యాటర్‌ను ఆడించాలని చూస్తుందట బీసీసీఐ. ఈ క్రమంలో మేనేజ్మెంట్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇషాన్ 2021 టీ20 వరల్డ్‌కప్‌లో కూడా ఆడాడు. అతడి కెరీర్లో ఇప్పటివరకు 32 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 124.37 స్ట్రైక్ రేట్‌తో 796 పరుగులు చేశాడు. దీంతో ఇషాన్ 2024 వరల్డ్‌కప్‌లో మూడో స్థానంలో కీ రోల్ ప్లే చేస్తాడని మేనేజ్మెంట్ భావిస్తోందట. అయితే గత ఏడాది కాలంగా విరాట్ టీ20 క్రికెట్ ఆడకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కానీ, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.