తెలంగాణ

telangana

ETV Bharat / sports

'విరాట్ అండతోనే డబుల్ సెంచరీ.. ఔట్ కాకపోయి ఉంటే 300 కొట్టేవాడ్ని' - ఇషాన్ కిషన్ విరాట్ కోహ్లీ

బంగ్లాదేశ్​తో మూడో వన్డేలో వీర విధ్వంసం సృష్టించిన టీమ్ఇండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్.. తాను ఔట్ కాకపోయి ఉంటే త్రిశతకం నమోదు చేసేవాడినని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ అండతోనే తాను ఈ రికార్డు సాధించగలిగినట్లు తెలిపాడు.

ISHAN KISHAN DOUBLE CENTURY
ISHAN KISHAN DOUBLE CENTURY

By

Published : Dec 11, 2022, 7:25 AM IST

బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్‌ చెలరేగిపోయాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ బాదేశాడు. అయితే ఔట్‌ కాకపోయి ఉంటే తాను కచ్చితంగా త్రిశతకం నమోదు చేసేవాడినని ఇషాన్‌ చెప్పాడు. ఈ ఫార్మాట్‌లో తొలి త్రిశతకం చేసే అవకాశాన్ని కోల్పోయినందుకు కాస్త అసంతృప్తిగా ఉందన్నాడు.

తన కెరీర్‌లో 10వ వన్డే మ్యాచ్‌ ఆడిన 24 ఏళ్ల ఇషాన్‌ కిషన్‌.. శనివారం నాటి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. కేవలం 126 బంతుల్లోనే ద్విశతకం సాధించి.. ఇప్పటి వరకు క్రిస్‌ గేల్‌ (138 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టేశాడు. ఈ మ్యాచ్‌లో 210 (134 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్స్‌లు) పరుగులు చేసిన ఇషాన్‌.. ఇన్నింగ్స్‌ 36వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్‌ అయ్యాడు. ఇన్నింగ్స్‌ బ్రేక్‌ మధ్యలో మీడియా ఛానల్‌తో మాట్లాడిన అతడు.. "ఇంకా 15 ఓవర్లు మిగిలి ఉండగానే నేను ఔటయ్యాను. లేదంటే కచ్చితంగా 300 చేసి ఉండేవాణ్ని" అని తెలిపాడు.

ద్విశతకం కొట్టిన తర్వాత ఇషాన్ సంబరం

ఇలా భారత్ తరఫున ద్విశతకం బాదిన నాలుగో బ్యాటర్‌ ఇషాన్ కిషన్ కావడం విశేషం. ఇప్పటివరకు రోహిత్‌ శర్మ (264, 209, 208*) మూడు సార్లు డబుల్‌ సెంచరీ సాధించగా.. వీరేంద్ర సెహ్వాగ్‌ (219), సచిన్‌ తెందూల్కర్‌ (200*) ఈ జాబితాలో ముందున్నారు. దీని గురించి ఇషాన్‌ మాట్లాడుతూ.. "అంతటి లెజెండ్స్‌ మధ్య నా పేరు ఉండటం గర్వంగా ఉంది. బ్యాటింగ్‌ చేసేందుకు పిచ్‌ బాగా సహకరించింది. నా ఆలోచన ఒక్కటే.. బంతి కనిపిస్తే షాట్‌ కొట్టాల్సిందే" అని చెప్పాడు.

కోహ్లీ అదే చెప్పాడు..
ఇక కోహ్లీతో భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ.. "విరాట్ భాయ్‌ అండతోనే నేను ఈ రికార్డు సాధించగలిగాను. ఏయే బౌలర్లను టార్గెట్‌ చేయాలో అతడే సూచించాడు. నేను 95 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిక్స్‌ కొట్టి సెంచరీ చేయాలని అనుకున్నా. కానీ కోహ్లీ నన్ను శాంతపర్చాడు. ఇది నీ తొలి సెంచరీ.. సింగిల్స్‌తో సాధించు. అదే నాకు కలిసొచ్చింది" అని ఇషాన్‌ వివరించాడు. ఈ మ్యాచ్‌లో తాను పెద్దగా ఒత్తిడికి గురవ్వలేదని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నానని యువ ఓపెనర్‌ తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details