Ishan Kishan Parents Interview:2023 ప్రపంచకప్ ప్రారంభమైంది. అన్నో అంచనాలతో భారత్ ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగనుంది. అక్టోబర్ 8న టీమ్ఇండియా.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే 15 మందితో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దేశం తరఫున ఇలాంటి మెగాటోర్నీల్లో ప్రాతినిధ్యం వహించాలనేది ప్రతీ ఆటగాడి కోరిక. కానీ అందరికీ అలాంటి అవకాశం దక్కకపోవచ్చు.
అయితే బిహార్‌కు చెందిన 25 ఏళ్ల వికెట్ కీపర్/బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు ఆ ఛాన్స్ లభించింది. అతడు ప్రపంచకప్‌నకు ఎంపికయ్యాడు. దీంతో అతడి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవ్. ఈ క్రమంలో ఇషాన్ తల్లిదండ్రులు ప్రణవ్ పాండే, సుచిత్రా సింగ్.. ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. మరి వారేమన్నారంటే..
"ఇషాన్ ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలడు. అతడిలో చాలా టాలెంట్ దాగి ఉంది. అది 2023 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో అందరూ చూశారు. ఆ మ్యాచ్‌లో ఇషాన్ మిడిలార్డర్లో అద్భుతంగా ఆడాడు. ఐపీఎల్లో కూడా అనేక మ్యాచ్‌ల్లో మిడిలార్డర్లో రాణించాడు. ఇక ఇషాన్ ప్రపంచకప్‌నకు ఎంపికవ్వడం చాలా ఆనందాన్నిచ్చింది. అయితే ఇప్పుడు తరచూ ఇషాన్‌ను.. కేఎల్ రాహుల్‌తో పోలుస్తున్నారు. ఒకప్పుడు కూడా సచిన్ తెందూల్కర్- వినోద్ కాంబ్లీలను పోల్చారు. కానీ ఎవరి టాలెంట్ వారిదే. ప్రస్తుతం ఇద్దరూ బాగా రాణిస్తున్నారు. ఇక పరిస్థితులను బట్టి తుది జట్టులో స్థానం ఉంటుంది. కానీ ఈసారి భారత్ ఎలాగైనా విశ్వకప్ విజేతగా నిలవాలి" అని ఇషాన్ తండ్రి ప్రణవ్ పాండే అన్నారు.
తమ కుమారుడ్ని టీవీలో చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఇషాన్ తల్లి సుచిత్రా దేవి."ఇషాన్ తన అభిప్రాయాలను నాతో పంచుకుంటాడు. ఒక ఆట గురించి తప్ప.. మిగిలిన అన్ని విషయాల్లో నేను తనతో మాట్లాడతా. ముఖ్యంగా ఇషాన్ ఆరోగ్యం పట్ల నాకు ఎప్పుడూ ఆందోళనే. కొంతకాలంగా ఇషాన్ జట్టుతో ప్రయాణిస్తున్న కారణంగా.. తనను ఎక్కువగా కలవలేకపోతున్నాను" అని ఇషాన్ తల్లి సుచిత్ర అన్నారు.
ఇషాన్ కిషన్ తల్లిదండ్రులతో ఈటీవీ భారత్ స్పెషల్ ఇంటర్వ్యూ ఈసారి కప్ టీమ్ఇండియాదే!
మరోవైపు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. చిన్ననాటి కోచ్ కేషవ్ రంజన్ బెనర్జీ.. ఝార్ఖండ్‌లో ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. ఈసారి భారత్ కచ్చితంగా వరల్డ్‌కప్ విజేతగా నిలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. "ధోనీ తన అనుభవంతో భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. మిగతా ఆటగాళ్లలో అరుదుగా ఉండే లక్షణం ధోనీలో ఉంది. అతడు వికెట్ల వెనుక నుంచి పరిస్థితికి తగ్గట్లు బౌలర్లకు సూచనలిస్తుంటాడు. అయితే ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చాలా మెచ్యూరిటీతో ఆలోచిస్తాడు. కానీ అతడి నాయకత్వ నైపుణ్యాలను.. ధోనీతో పోల్చలేం. ఇక రంజీల్లో ఝార్ఖండ్ తరఫున ఆడుతున్న ఇషాన్ కిషన్.. టోర్నీకి సెలెక్ట్ అవ్వడం సంతోషాన్నిచ్చింది. అలాగే రోహిత్, విరాట్, కేఎల్ రాహుల్‌తో టీమ్ఇండియా పటిష్ఠంగా ఉంది. ఇక నవంబర్ 19న జరిగే ఫైనల్స్‌లో ఈ జట్టు కచ్చితంగా ఉంటుంది. డిఫెండింగ్ ఛాంప్ ఇంగ్లాండ్- భారత్ మధ్యే తుదిపోరు జరుగుతుంది. ఒత్తిళ్లను ఎదుర్కోవడంలో రోహిత్ దిట్ట. 1983లో కపిల్ దేవ్, 2011లో ధోనీ.. భారత్‌కు ట్రోఫీని అందించారు. ఇప్పుడు అంతటి సువర్ణావకాశం రోహిత్‌కు దక్కింది. సొంత గడ్డపై భారత్ విజయం సాధించడం పక్కా" ఇని బెనర్జీ అన్నారు.
Trump Dhoni : ధోనీకి ట్రంప్ స్పెషల్ ఇన్విటేషన్.. గోల్ఫ్ ఆడేందుకు పిలిచి..
WTC FINAL 2023 : కేఎల్ రాహుల్ స్థానంలో మరో స్టార్ ప్లేయర్!.. అనౌన్స్ చేసిన బీసీసీఐ