Ishan Kishan Australia Series : టీమ్ఇండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు మ్యాచ్‌లకు పక్కన పెట్టడం పట్ల మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇషాన్‌కు పదే పదే అన్యాయం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బీసీసీఐ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్ కిషన్‌లో ప్రతిభావంతుడైన ఆటగాడు ఉన్నాడని, తనదైన రోజున అతడు జట్టును భుజాన మోస్తాడని చెప్పారు. అలాంటి ఆటగాడికి తగినన్ని అవకాశాలను కల్పించి జట్టులో కుదురుకునేందుకు సమయం ఇవ్వాలని సూచించాడు. అయితే, బీసీసీఐ తీరు మాత్రం ప్లేయర్ల సెలక్షన్‌పై కాకుండా జట్టులో నుంచి ఎవరిని తప్పించాలన్న విషయంపైనే ఉంటుందని జడేజా మండిపడ్డారు.
"వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడారు. అయితే ఇషాన్ కిషన్ మాత్రం మూడు మ్యాచ్‌లు ఆడి ఇంటికెళ్లిపోయాడు. అతడు మూడు మ్యాచులకే అంతగా అలసిపోయాడా? వరల్డ్ కప్‌లోనూ అతన్ని సరిగా ఆడించలేదు. ప్రపంచ కప్‌లో జరిగిన మ్యాచుల్లోనూ అతడికి అవకాశం ఇవ్వాల్సింది. తనదైన రోజు ఎంతమంది ఇండియన్ క్రికెటర్లు వన్డేల్లో డబుల్ సెంచరీలు చేశారు? అతడు మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చేయగలడు. అతడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు? ఎన్ని రోజులు ఇలా అతన్ని ట్రయల్లో వాడుకుంటారు? గత రెండేళ్లలో అతడు ఆడిన మ్యాచులు ఎన్ని? ఇండియన్ క్రికెట్లో ఈ సమస్య ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో వీళ్లు ప్లేయర్లను సెలక్ట్ చేయట్లేదు రిజక్ట్ చేస్తారంతే" అని జడేజా అన్నాడు.