బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన టీమ్ఇండియా.. ప్రస్తుతం మూడో టెస్టు కోసం సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలుపొందాలని పట్టుదలతో ఉంది. అలానే మరోవైపు తొలి రెండు టెస్టుల్లో ఘోర ఓటమిని అందుకున్న ఆసీస్ కనీసం మూడో మ్యాచ్‌లోనైనా పోటీనిచ్చి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. మార్చి1వ తేదీ నుంచి ఇండోర్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌లో మనోళ్లు విజయం సాధిస్తే నేరుగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.
అయితే ఈ మూడో టెస్టుకు ముందు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఏకంగా 14 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. మూడో టెస్టులో మరో తొమ్మిది వికెట్లు సాధిస్తే.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు ఈ మెగా ట్రోఫీలో అతడు 103 వికెట్లు తీశాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో టీమ్ఇండియా దిగ్గజం అనిల్ కుంబ్లే 111 వికెట్లతో అగ్ర స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు అశ్విన్ మరో ఎనిమిది వికెట్లు తీస్తే.. కుంబ్లే రికార్డును సమం చేస్తాడు. అదే తొమ్మిది వికెట్లు తీస్తే.. జంబో రికార్డును అధిగమించి తొలి స్థానానికి చేరుకుంటాడు. అలా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. మరి ఈ అరుదైన రికార్డు అతడు అధిగమిస్తాడో లేదో చూడాలి.