2007 టీ20 ప్రపంచకప్ ముంగిట ఏం జరిగిందో గుర్తుందా?.. సచిన్, ద్రవిడ్, గంగూలీ లాంటి సీనియర్లు లేకుండా ప్రపంచకప్‌కు వెళ్లింది టీమ్‌ఇండియా. అప్పుడు ఈ సీనియర్లపై వేటు వేసినట్లు ప్రకటనేమీ రాలేదు. కానీ వాళ్లు తర్వాత మళ్లీ ఎప్పుడూ టీ20ల్లో కనిపించలేదు. ధోని సారథ్యంలో ఎక్కువగా కుర్రాళ్లతో నిండిన జట్టు ప్రపంచకప్ గెలిచి సంచలనం సృష్టించింది. ఇప్పుడు మళ్లీ భారత టీ20 జట్టులో సీనియర్లను పక్కన పెట్టి కుర్రాళ్లకే పెద్ద పీట వేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్య నేతృత్వంలో శ్రీలంక సిరీస్‌కు ప్రకటించిన టీ20 జట్టును చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది.
ఆ ఇద్దరూ స్వచ్ఛందంగా... విరాట్ కోహ్లి టీ20 కెప్టెన్‌గా తప్పుకున్నాక ఎన్నో అంచనాల మధ్య జట్టు పగ్గాలు అందుకున్నాడు రోహిత్ శర్మ. అతడి సారథ్యంలో అయినా జట్టు ప్రపంచకప్ గెలుస్తుందేమో అనుకుంటే.. మళ్లీ వైఫల్యం తప్పలేదు. ప్రపంచకప్ కంటే ముందు ఆసియా కప్‌లో కనీసం ఫైనల్ అయినా చేరకుండా నిష్క్రమించినపుడే జట్టు మీద అంచనాలు తగ్గిపోయాయి. ఇక ప్రపంచకప్‌లో సూపర్-12 వరకు బాగానే ఆడినా.. సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవంతో ఇంటిముఖం పట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది భారత్. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రోహిత్ శర్మ పనితనంపై అనేక ప్రశ్నలు రేకెత్తాయి. మరోవైపు ఓపెనర్ కేఎల్ రాహుల్ చాన్నాళ్ల నుంచి పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. కోహ్లి ఆ టోర్నీ వరకు బాగానే ఆడినా.. మునుపటి జోరు తగ్గిన అతణ్ని టీ20ల్లో కొనసాగించడం సరైందేనా అన్న ప్రశ్నలు తలెత్తాయి. మరోవైపు అంతకంతకూ ప్రదర్శన పడిపోతుండడంతో భువనేశ్వర్‌పై వేటు వేయాల్సిందే అన్న డిమాండ్లు మరింత పెరిగాయి. ఈ నలుగురూ శ్రీలంకతో సిరీస్‌కు జట్టులో లేరు. వీరితో పాటు నిలకడ లేమితో సతమతం అవుతున్న పంత్ కూడా వన్డే, టీ20 జట్లకు దూరమయ్యాడు. పంత్ వయసు తక్కువే కాబట్టి పునరాగమనం చేయొచ్చు. కానీ పై నలుగురూ మాత్రం మళ్లీ టీ20 జట్టులో ఆడతారా అన్నది సందేహమే. వీళ్లందరూ 30, అంతకంటే ఎక్కువ వయసున్న వారే. వయసు, ఫామ్ పరంగా చూస్తే రోహిత్ (35 ఏళ్లు), కోహ్లి (34 ఏళ్లు) కెరీర్ చరమాంకానికి చేరువ అవుతున్నట్లే. ఇంకో రెండేళ్లకు జరిగే టీ20 ప్రపంచకప్‌లో వీళ్లు ఆడే అవకాశాలు ఎంతమాత్రం లేదు. అందుకే ఈ ఇద్దరూ స్వచ్ఛందంగా టీ20లకు దూరమైనట్లుగా కనిపిస్తోంది. రాహుల్‌కు 30 ఏళ్లే అయినా.. అతణ్ని టీ20 జట్టులో కొనసాగిస్తుండడంపై తీవ్ర విమర్శలు వస్తుండడంతో సెలక్టర్లు పక్కన పెట్టినట్లున్నారు. 32 ఏళ్ల భువనేశ్వర్‌కు 2022 టీ20 ప్రపంచకప్‌ను చివరి అవకాశంగా భావించారు. అందులో అతను విఫలమవడంతో దాదాపుగా కెరీర్ ముగిసినట్లే కనిపిస్తోంది. కోహ్లి, రోహిత్, రాహుల్ దృష్టి వచ్చే ఏడాది చివర్లో సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్ మీదే ఉన్నట్లుంది. ఈ ముగ్గురూ లంకతో వన్డేలకు జట్టులోకి ఎంపికవడం గమనార్హం.