Irfan Pathan Comments On Umran Malik : దక్షిణాఫ్రికా పిచ్‌లపై ఆడి నిరూపించుకునేందుకు భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం ఇవ్వకపోవడం పట్ల మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత సెలక్టర్లు ఎంపిక చేసిన తుది జట్లపై మాజీ ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో బహిరింగంగానే పోస్టు పెట్టాడు. ఈ ట్వీట్లో ఉమ్రాన్ మాలిక్‌కు తన పూర్తి మద్దతును ప్రకటించాడు ఇర్ఫాన్. 'కనీసం ఈ టూర్‌కైనా ఉమ్రాన్ మాలిక్‌కు ఓ అవకాశం ఇచ్చి ఉండాల్సింది. గత 11 నెలల క్రితం టీమ్‌ఇండియాలో ఉన్న ప్లేయర్‌కు ఈసారైనా జట్టులో స్థానం దక్కుతుందని అనుకున్నాను. కానీ అలా జరగలేదు' అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఈ మాజీ ఆల్‌రౌండర్.
Irfan Pathan Umran Malik : ఇప్పుడే కాదు గతంలోనూ అనేక సందర్భాల్లో ఉమ్రాన్ మాలిక్‌కు మద్దతుగా నిలిచాడు పఠాన్. ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ కశ్మీరీ యువ పేసర్‌కు అక్కడ ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదని పేర్కొన్నాడు. ఈ విషయంపై కూడా అప్పట్లో ట్విట్టర్ వేదికగా స్పందించాడు ఇర్ఫాన్. 'ఐపీఎల్‌లోనే అత్యంత వేగవంతమైన బౌలరైన ఉమ్రాన్‌ను రిజర్వు బెంచ్‌కే ఎందుకు పరిమితం చేశారో నాకర్థం కావడంలేదు. అతడిని ఎస్ఆర్హెచ్ ఫ్రాంఛైజీ సరిగ్గా వినియోగించుకోలేక పోయింది' అని రాసుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. ప్రత్యర్ధి బ్యాటర్లకు ధారాళంగా పరుగులిచ్చేస్తాడనే అపవాదు ఉమ్రాన్‌పై ఇప్పటికీ ఉంది. అతడు ఎప్పుడూ లైన్ అండ్ లెంగ్త్‌ను కోల్పోవడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తున్నాయని చాలా మంది అభిప్రాయం. వన్డేల్లో అతడి ఎకానమీ 6.54గా ఉండగా.. టీ20ల్లో మాత్రం ఏకంగా 10.48గా ఉంది.