Tilak Varma: ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు 19 ఏళ్ల తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. సూర్యకుమార్ యాదవ్ లేని లోటును తీరుస్తూ టాప్ ఆర్డర్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో.. రూ.1.7 కోట్లు పెట్టి ఇతడిని దక్కించుకుంది ముంబయి ఇండియన్స్. తనపై యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 22, 61 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 173గా ఉండటం విశేషం.
ముంబయి ఇండియన్స్ నుంచి ఎందరో కుర్రాళ్లు.. స్టార్లుగా ఎదిగారు. జాతీయ జట్టులోనూ చోటు సంపాదించుకున్నారు. బుమ్రా, హార్దిక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఇలా ఎందరో ఉన్నారు. ఇప్పుడు తిలక్ కూడా ఆ జాబితాలో చేరినట్లే అనిపిస్తోంది. పేద కుటుంబానికి చెందిన తిలక్ వర్మ.. జూనియర్ స్థాయిలో విశేషంగా రాణించి వెలుగులోకి వచ్చాడు. 2020 అండర్-19 వరల్డ్‌కప్‌కు ఎంపికైనా.. అక్కడ అంతగా రాణించలేకపోయాడు. అయినా అతడి కెరీర్‌ను అవేమీ అడ్డుకోలేకపోయాయి. దేశవాళీల్లో అద్భుత ప్రదర్శనలతో ఐపీఎల్ కాంట్రాక్టు దక్కింది. అతడికి ఇప్పటివరకు సొంత ఇల్లు లేదంట. ఇప్పుడు ఐపీఎల్లో వచ్చే ఆదాయంతో.. ఇల్లు కొనుక్కోవాలని చూస్తున్నాడట.
''మేం పెరుగుతున్న కొద్దీ.. మాకు ఆర్థిక కష్టాలు పెరిగిపోయాయి. మా నాన్నకు వచ్చే కొద్దిపాటి జీతంతో.. నా క్రికెట్ ఖర్చులు, అన్నయ్య చదువును చూసుకోవాల్సి వచ్చేది. కొంతకాలంగా స్పాన్సర్షిప్స్, క్రికెట్ ఆడితే వచ్చితే డబ్బులతో నా ఖర్చులను నేనే చూసుకుంటున్నా. మాకు సొంత ఇల్లు లేదు. ఐపీఎల్లో సంపాదించిన డబ్బుతో.. నా తల్లిదండ్రులకు ఇల్లు ఇవ్వడమే నా ఏకైక లక్ష్యం. వేలంలో నాకు దక్కిన ధర చూసి నా కోచ్, తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు.''