Watson on KL Rahul: ఐపీఎల్లో భాగంగా గురువారం రోజు.. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబయి డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గెలిచి లఖ్‌నవూ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. మరోవైపు గుజరాత్‌పై ఓడిన దిల్లీ ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. లఖ్‌నవూ ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. దిల్లీ ఆడిన రెండిట్లో ఒకటి గెలిచి మరోటి ఓడి.. పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
అయితే నేడు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడాడు దిల్లీ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్. లఖ్‌నవూ టీం గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులో జేసన్ హోల్డర్, కృనాల్ పాండ్య, దీపక్ హుడా వంటి చక్కటి నైపుణ్యం గల ఆల్‌రౌండర్లు ఉన్నారని, కానీ అదే కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు టోర్నీ మొత్తం తలనొప్పిగా మారుతుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
''జట్టులో నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉండటం నిజంగా కెప్టెన్‌కు ప్లస్సే. అందులో సందేహం లేదు. ప్రధాన బౌలర్లు ఎవరైనా లేకుంటే.. వీళ్లను ఉపయోగించుకోవచ్చు. నష్టాన్ని కాస్త తగ్గించుకోవచ్చు. కృనాల్ పాండ్య బాగా బౌలింగ్ చేస్తున్నాడు. దీపక్ హుడా, జేసన్ హోల్డర్ గత మ్యాచ్‌లో మంచి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశారు. అయితే.. ఇక్కడే కెప్టెన్ రాహుల్‌కు పెద్ద తలనొప్పి తెస్తుంది. ఏ ఓవర్ ఎవరితో వేయించాలో తెలియక సతమతం అవుతాడు. ప్లాన్స్ అన్నీ బెడిసికొడతాయి.''
- షేన్ వాట్సన్, దిల్లీ అసిస్టెంట్ కోచ్