IPL 2023 LSG VS RCB : ఐపీఎల్ సీజన్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మ్యాచ్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీయడాన్ని చూసిన మిగతా ప్లేయర్స్ వారిని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అమిత్ మిశ్రా కోహ్లీని శాంతపరచగా.. కేఎల్ రాహుల్ గంభీర్‌ను పక్కకు తీసుకెళ్లాడు.
అయితే గత నెల 10వ తేదీన బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ ఓడించినపుడు స్టేడియంలో బెంగళూరు అభిమానుల వైపు చూస్తూ లఖ్‌నవూ మెంటార్ గంభీర్.. నోటికి తాళాలు వేసుకోమన్నట్లుగా సంజ్ఞ చేశాడు. దాన్ని మనసులో పెట్టుకున్న కోహ్లి.. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు గెలుపు బాటలో సాగుతున్నపుడు రెచ్చిపోయాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంతే కాకుండా గత మ్యాచ్‌లోనూ గంభీర్ చేసిన తీరులోనే విరాట్ కోహ్లీ కూడా ఆయూష్ బదోని క్యాచ్ అందుకోగానే గంభీర్‌లానే ష్.. గప్‌చుప్ అంటూ ప్రేక్షకులకు సూచించాడు.
Virat Gambhir Controversy : మ్యాచ్ జరుగుతున్నంత సేపు విరాట్ కోహ్లీ చాలా దూకుడుగానే కనిపించాడు. లఖ్‌నవూ జట్టు వికెట్ కోల్పోయినప్పుడల్లా కూడా సంబరాలు చేసుకున్నాడు. మ్యాచ్ గెలిచిన ఆనందంలో మైదానంలోనే గట్టిగా అరిచాడు. కోహ్లీ చేస్తున్న చర్యలతో ఆగ్రహానికి గురైన గంభీర్.. అతన్ని ఏదో అనగా విరాట్ దానికి ధీటుగా బదులిచ్చాడు. ఇక విరాట్ కోహ్లీని శాంతపరిచేందుకు కేఎల్ రాహుల్ చాలా మేరకు ప్రయత్నించాడు. పక్కకు తీసుకెళ్లి కాసేపు మాట్లాడాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ తర్వాత కూడా ఈ ఇద్దరూ ఆటగాళ్లు వాగ్వాదానికి దిగారు. కోహ్లీతో మాట్లాడుతున్న కైల్ మేయర్స్‌ను గంభీర్ పక్కకు తీసుకెళ్లగా.. విరాట్ మండిపడ్డాడు. గతంలోనే వీరిద్దరూ వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. 2013లో కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్న గంభీర్‌తో కోహ్లీకి మధ్య తొలిసారిగా వాగ్వాదం జరిగింది.