virat kohli rohit sharma ipl: బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ సరైన ఫామ్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ టీ20 సీజన్‌లో తమ పేలవ ప్రదర్శనతో అటు అభిమానులను.. ఇటు జట్టు యాజమాన్యాన్ని పూర్తిగా నిరాశ పరుస్తున్నారు. ఈ సీజన్‌లో రెండుసార్లు కోహ్లీ గోల్డెన్ డక్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కోహ్లీ ఫామ్‌పై స్పందించాడు. అతడు చీకటి ప్రదేశంలో ఉన్నాడంటూ వ్యాఖ్యానించాడు.
Rohit poor performance IPL:"ప్రస్తుతం కోహ్లీ ఏ స్థితిలో ఉన్నాడో.. గతంలో నా కెరీర్‌లో రెండుసార్లు నేను కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఇది మంచిది కాదు. అతడు చీకటి ప్రదేశంలో ఉన్నాడు. ముఖ్యంగా.. అందరి దృష్టి అతడిపైనే ఉన్నప్పుడు.. అది పూర్తిగా ఒంటరి ప్రదేశం. ఇది త్వరగా ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆట కోసం అతడు పరుగులు సాధించాల్సి ఉంది" అని పీటర్సన్ పేర్కొన్నాడు. అయితే, ఇది తాత్కాలికమేనని ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ అభిప్రాయపడ్డాడు. 'కోహ్లీ ప్రస్తుతం ఉన్న దశను ప్రతి ఆటగాడు అనుభవిస్తాడు. ఇంకో నిజం ఏంటంటే.. ఆ దశను దాటి మళ్లీ అద్భుతంగా రాణిస్తారు' అని చెప్పుకొచ్చాడు.
Kohli IPL Golden Duck:ఇక భారత మాజీ సారథి సునిల్ గావస్కర్ కూడా కోహ్లీ ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'ఎవరైనా కొన్ని బంతులు కూడా ఎదుర్కోకుండా ఔట్ అయితే వారి బ్యాటింగ్ గురించి చెప్పడం కష్టం. కనీసం డజన్ బంతులైనా ఆడితే.. ఫుట్‌వర్క్ ఎలా ఉంది.. లైన్‌లోనే ఆడుతున్నాడా.. ఈ సాంకేతికతో ఆడితే బాగుంటుంది.. అని చెప్పొచ్చు' అని గావస్కర్ వివరించాడు.
కోహ్లీ కొద్దిరోజులు ఆట నుంచి విరామం తీసుకోవాలని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ సూచించాడు. తగిన విశ్రాంతి తీసుకొని తనను తాను పునరుత్తేజం చేసుకోవాలని అన్నాడు. సీనియర్ పేసర్ ధవల్ కులకర్ణి సైతం రోహిత్, కోహ్లీలను వెనకేసుకొచ్చాడు. ఫామ్ తాత్కాలికమేనని, క్లాస్ శాశ్వతమని చెప్పుకొచ్చాడు. విరాట్, రోహిత్ ఇద్దరూ ఛాంపియన్లు అని స్పిన్నర్ అమిత్ మిశ్ర అన్నాడు. ఇప్పటికీ వీరు ఉత్తమ ఆటగాళ్లేనని పేర్కొన్నాడు. ప్రస్తుత సమయంలో అందరూ వీరికి అండగా ఉండాలని పిలుపునిచ్చాడు.