Virat kohli IPL team: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు పర్యాయపదంలా మారిపోయాడు విరాట్ కోహ్లీ. ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఒకే జట్టులో కొనసాగుతున్న ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఎనిమిది సీజన్లలో జట్టుకు నాయకత్వం వహించాడు. ఒక్కసారి కప్పు గెలవకపోయినప్పటికీ.. ఈ జట్టుకు మాత్రం భారీగా అభిమానులు మద్దతు ఇస్తుంటారు. అలాంటి జట్టులోని విరాట్ కోహ్లీని ఆర్సీబీ కాకుండా వేరే జెర్సీలో ఊహించుకోలేం. అయితే, తనకు ఇతర ఫ్రాంఛైజీల నుంచి చాలాసార్లు ఆఫర్లు వచ్చాయని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
Virat kohli news:"నిజానికి నేను వాటి గురించి ఓసారి ఆలోచించాను. నన్ను చాలా సార్లు సంప్రదించారు. ఆక్షన్‌కు నా పేరును ఇవ్వాలని సూచించారు. కానీ నేను అలా చేయలేదు. ఆర్సీబీ నన్ను చాలా నమ్మింది. ఆదినుంచి నన్ను ప్రోత్సహించింది. ఐపీఎల్ తొలి మూడు సీజన్లలోనూ నాకు అవకాశాలు ఇచ్చింది. అది నాకు ప్రత్యేకం. అప్పుడు చాలా టీమ్‌లకు ఆ అవకాశం ఉన్నా.. వారు నన్ను ప్రోత్సహించలేదు. నాపై విశ్వాసం ఉంచలేదు" అని కోహ్లీ చెప్పాడు. దిల్లీకి చెందిన కోహ్లీని 2008 వేలంలో బెంగళూరు కొనుగోలు చేసింది. అప్పటి దిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు డ్రాఫ్ట్ పద్ధతిలో హోమ్ టీమ్ ప్లేయర్‌గా కోహ్లీని తీసుకునే అవకాశం ఉండేది. కానీ దిల్లీ కోహ్లీ బదులు ప్రదీప్ సాంగ్వాన్‌ను జట్టులోకి తీసుకుంది.
కాగా, ఐపీఎల్లో కప్పు గెలవలేదనే విషయాన్ని తాను పెద్దగా పట్టించుకోనని కోహ్లీ చెప్పుకొచ్చాడు. "ఇప్పుడు నేను విజయవంతమయ్యాను. 'కానీ ఐపీఎల్లో సక్సెస్ అవ్వలేదు' అని కొందరు అభిప్రాయపడుతుంటారు. ఇది ఇంగ్లాండ్ పర్యటనల విషయంలోనూ నాకు ఎదురైంది. 2018కి ముందు వరకు ఇంగ్లాండ్‌లో తప్ప ప్రపంచంలోని అన్ని దేశాల్లో రాణించాను. ఎప్పుడైనా, 'కానీ' అనేది ఏదో రకంగా మనకు ఎదురవుతుంది. అది లేకుంటే జీవితం లేదు. అందుకే నాకు నచ్చిందే చేస్తా. అనుష్క మినహా నాకు ఏ వ్యక్తి అభిప్రాయం ముఖ్యం కాదు. ఎవరైనా కొన్నేళ్లే జీవిస్తారు. ఆ తర్వాత చనిపోతారు. ప్రపంచం అక్కడితో ఆగిపోదు. చాలా మంది గొప్ప ఆటగాళ్లు చాలా ట్రోఫీలు గెలిచారు. కానీ ఎవరూ వాటిని గుర్తుంచుకోరు. 'అతడో ఐపీఎల్ ఛాంపియన్. అతడో వరల్డ్ కప్ ఛాంపియన్' అని పిలవరు. నువ్వు మంచి వ్యక్తివైతే ప్రజలు గుర్తుంచుకుంటారు. చెడ్డ వ్యక్తి అయితే మర్చిపోతారు. ఇదే జీవితం. ఐపీఎల్ టోర్నీ గెలిస్తే కొందరు శుభాకాంక్షలు చెబుతారు. ఇది ఐదు నిమిషాల ఆనందం మాత్రమే. ఆరో నిమిషంలో నీ జీవితంలో ఉన్న ఇతర విషయాలతో ఇబ్బందులు మొదలవ్వచ్చు" అంటూ ఫిలాసఫీ చెప్పాడు కోహ్లీ.
ఆర్సీబీ తరఫున కోహ్లీ 217 మ్యాచ్‌లు ఆడాడు. 6469 పరుగులు చేశాడు. 2021 సీజన్ తర్వాత కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
ఇదీ చదవండి:'అతడిని ఎలా ఆడిస్తారు?'.. ఐసీసీ టోర్నీల్లో భారత్ వైఫల్యాలపై యువీ