ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటాడు. ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుంటాడు. ముఖ్యంగా ఇతను క్యాచ్‌లు పట్టే స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. అయితే సాధారణంగా కోహ్లీ క్యాచ్‌లు వదిలేయడం అనేది చాలా అరుదు. క్లిష్ట పరిస్థితుల్లో లేదా తీవ్ర ఒత్తిడిలో తప్ప మిగతా అన్ని సందర్భాల్లోనూ తన క్యాచింగ్ స్కిల్స్‌తో అదరగొడుతుంటాడు. అలాంటి కింగ్ కోహ్లీ మొదటిసారి ఓ క్యాచ్ పట్టే విషయంలో సందిగ్ధతకు లోనయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
గురువారం పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఆ టీమ్‌కు చెందిన జితేశ్ శర్మ రంగంలోకి దిగాడు. సరిగ్గా 17వ ఓవర్లో అతను ఓ భారీ షాట్ ఆడాడు. దీంతో ఆ బాల్‌ను క్యాచ్ చేసేందుకు డీప్ మిడ్ వికెట్లో ఉన్న సుయాశ్ ప్రభు దేశాయ్ పరుగులు తీశాడు. ఇంతలో లాంగాన్‌లో ఉన్న కోహ్లీ కూడా క్యాచ్ పట్టేందుకు ముందుకొచ్చాడు. ఇక సుయాశ్‌ను గమనించిన కోహ్లీ.. నువ్వు ఆగిపో నేను పట్టుకుంటాలే.. అన్నట్టుగా సైగ చేశాడు.
కోహ్లీ సైగను అర్థం చేసుకున్న సుయాశ్ కొద్దిగా స్లో అయ్యాడు. అయితే పట్టుకుందామని వచ్చి కోహ్లీ మాత్రం క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. చేతిలో పడినట్లే పడి ఆ బంతి పట్టుతప్పి కిందపడిపోయింది. ఇక క్యాచ్ పోయింది అని నిరాశగా చూస్తున్న సుయాశ్‌ను చూసి కోహ్లీ నవ్వుతూ మిస్ అయింది అని చెప్పాడు.
పంజాబ్ మ్యాచ్‌లో కోహ్లీ రికార్డుల మోత..
గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు ఓపెనర్‌గా దిగిన విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులను తన ఖాతాలోకి వేసుకున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పక్కటెముక గాయంతో బాధపడుతూ ఫీల్డింగ్ చేయకపోవడం వల్ల ఆర్సీబీ స్టాండింగ్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నకోహ్లీ.. అన్నీ తానై జట్టును చూసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో 59 పరుగులను స్కోర్ చేసిన ఈ స్టార్ బ్యాటర్... 24 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 47 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో స్టేడియాన్ని దద్దరిల్లేలా చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ పలు రికార్డులను సాధించాడు. ఐపీఎల్లో ఉన్న కెప్టెన్లు అందరిలో 6500 పరుగులు స్కోర్ చేసిన మొట్టమొదటి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అంతే కాకుండా ఐపీఎల్లో 600 ఫోర్లు కొట్టిన మూడో బ్యాట్స్ మన్ విరాట్. ఈ లిస్ట్‌లో 730 ఫోర్లతో శిఖర్ ధావన్ మొదటి స్థానంలో ఉండగా..608 ఫోర్లతో దిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.