ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన సన్‌రైజర్స్ జట్టు పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు ఈ సారి ఏడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడే అవకాశం లభించింది. అయితే ఆ తర్వాత అతను గేమ్లో కనిపించకపోవడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో గురువారం బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ కెప్టెన్ మార్‌క్రమ్‌ను ఇదే ప్రశ్న అడగ్గా.. దానికి అతను విచిత్రంగా స్పందించాడు.
"నిజాయతీగా చెప్పాలంటే ఎందుకు అన్న విషయం నాకు కచ్చితంగా తెలియదు. ఉమ్రాన్ ఓ కీలక ఆటగాడు. 150 కిమీ వేగంతో బంతులను సంధిస్తాడు. తెర వెనుక ఏం జరుగుతుందో నాకు నిజంగా తెలియదు. కానీ అతనిలో ఫలితాల్ని రాబట్టగల నేర్పు ఉంది" అని మార్‌క్రమ్ అన్నాడు. అయితే అతను అన్న మాటలు ఇప్పుడు అనేక చర్చలకు దారి తీస్తోంది. ఇక ఇదే విషయంపై టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ సెహ్వాగ్ మీడియాతో మాట్లాడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంతో ఆ జట్టు పేసర్ ఉమ్రాన్ మాలిక్ గొడవపడి ఉండొచ్చు అని ఆయన అభిప్రాయపడ్డాడు.
"తెర వెనుక అంటే ఏంటో నాకు నిజంగా అర్థం కాలేదు. ఫ్రాంచైజీ యాజమాన్యంతో ఉమ్రాన్ గొడవ పడి ఉండొచ్చు. లేదా వారి మధ్య వాదన జరిగిందేమో. అది సరైనది కాదు. అవకాశం ఇచ్చినప్పుడు సత్తా చాటకపోతే మళ్లీ ఛాన్స్ వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. మైదానంలో తమ ప్రదర్శనతో నోరు మూయించాలి. గతంలో డేవిడ్ వార్నర్ కూడా ఇలాగే చెప్పాడని అనుకుంటున్నాను. సరైన భాష కూడా అదే. మార్‌క్రమ్ కాస్త మెరుగ్గా చెప్పాడు" అని సెహ్వాగ్ తెలిపాడు.
అయితే ఈ ఏస్ ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్.. టీమ్ఇండియా తరఫున కాకుండా ఐపీఎల్‌లోనూ తన అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. తన క్రికెట్ కెరీర్లో ఇప్పటి వరకు 8 వన్డేలు, 8 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో భాగంగా అతను వరుసగా 13 అలాగే 11 వికెట్లను పడగొట్టాడు. మరోవైపు తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడాడు. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో.. తన అద్భుత ప్రదర్శనతో స్టేడియంను షేక్ చేశాడు. అయితే అప్పుడు వార్నర్‌కి జరిగిన అవమానమే.. ఇప్పుడు ఉమ్రాన్‌కి కూడా జరుగుతోందా అంటూ ఫ్యాన్స్ ఆందోళనచెందుతున్నారు. అసలు హైదరాబాద్ క్యాంప్ లో ఏం జరుగుతుందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఉమ్రాన్ మాలిక్ హైదరాబాద్ ఆటగాడని మార్కరమ్కు అసలు తెలుసా లేదా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.