Gavaskar on Rohit Sharma: ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ సంచలన కామెంట్స్ చేశాడు. ధోనీ, రోహిత్ కెప్టెన్సీలను పోలుస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు. 'ధోనీ ఏ పని చేసినా ఆకాశానికెత్తుతారని, అదే రోహిత్ చేస్తే మాత్రం ఎవరూ పట్టించుకోరు' అని అభిప్రాయపడ్డాడు. లఖ్‌నవూ- ముంబయి మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనే ఈ విషయం స్పష్టంగా అర్థమైందని వ్యాఖ్యానించాడు. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఇలా సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు.
'ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ముంబయి సారథిగా ఐదు టైటిళ్లు గెలిచినప్పటికీ అతడి కెప్టెన్సీకి తగిన గుర్తింపు దక్కడం లేదు. లఖ్‌నవూతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ దీనికి పెద్ద ఉదాహరణ. ముంబయి పేసర్ ఆకాశ్ మధ్వాల్ ఓవర్ ద వికెట్ బౌలింగ్ చేసి ఆయుశ్ బదోనిని ఔట్ చేశాడు. లెఫ్టాండ్ బ్యాటర్ నికోలస్ పూరన్ రాగానే రౌండ్ ద వికెట్ బౌలింగ్ చేసి అతడి వికెట్‌ను తీశాడు. చాలా మంది బౌలర్లు ఇలా తమ బౌలింగ్ ఎండ్‌ను మార్చరు. ఓవర్ వికెట్ రిథమ్ దొరికితే లెఫ్టాండర్ బ్యాటింగ్ వచ్చినా కూడా అదే ఎండ్‌లో బౌలింగ్‌ను కొనసాగిస్తారు. లెఫ్టాండర్‌కు ఆఫ్ ద వికెట్‌కు దూరంగా వెళ్లేలా బంతులు వేసేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇక్కడ మధ్వాల్.. రోహిత్ సూచనలతో తన ఎండ్‌ను మార్చుకొని వికెట్ తీసాడు. ఇదే ధోనీ కెప్టెన్సీలో జరిగి ఉంటే ప్రతి ఒక్కరూ పూరన్‌ను.. ధోనీయే ఔట్ చేశాడని మాట్లాడుకునేవారు. ఒక రకమైన హైప్ క్రియేట్ చేసేవారు. రోహిత్ శర్మ తన బౌలర్లను తెలివిగా ఉపయోగించుకుంటున్నప్పటికీ.. ధోనీలాగా అతడికి క్రెడిట్ ఇవ్వడం లేదు. రోహిత్ శర్మ కూడా ఈ క్రెడిట్ తనదేనని చెప్పుకోవట్లేదు. ఐదు వికెట్లు తీసిన మధ్వాల్‌కే గుర్తింపు దక్కాలనుకున్నాడు.' అని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.