ఐపీఎల్ 14వ సీజన్‌లో హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. తొలుత బౌలర్లు నమ్మకాన్ని నిలబెడుతూ పంజాబ్‌ను 120 పరుగులకే కట్టడి చేశారు. ఖలీల్ 3 వికెట్లు, అభిషేక్ 2 వికెట్లతో ఆకట్టుకున్నారు. తర్వాత జానీ బెయిర్‌స్టో 63 పరుగులతో రాణించడం వల్ల రైజర్స్ 18.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికే లక్ష్యాన్ని చేరుకున్నారు.
ఆఖరి మెట్టు ఎక్కేశాం.. జానీ బెయిర్‌స్టో
చాలా సార్లు గెలుపు అంచు వరకు వస్తూనే ఉన్నాం. కానీ విజయాన్ని అందుకోవడంలో చిన్న తడబాటు ఉండిపోయింది. దీన్ని నిర్లక్ష్యం అనే అనుకోవాలి. అయితే ఇప్పుడు మేం దీన్ని అధిగమించాం. పవర్‌ప్లే తరవాత మా ఆట చాలా ఇబ్బందిగా మారిపోతోంది. అయితే పవర్‌ప్లేలో వీలైనన్ని పరుగులు సాధించడం కూడా అవసరం. అలాగే ఆడుతున్నాం. ఇక కేన్ విలియమ్సన్ రావడం ఆనందంగా ఉంది.
అంతా మా బౌలర్ల చలవే.. డేవిడ్ వార్నర్
ఈ గెలుపు చాలా ఆనందంగా ఉంది. మా బౌలర్లు చక్కగా బంతులేశారు. వాళ్లను కట్టడి చేశారు. అభిషేక్ బౌలింగ్ పట్ల సంతృప్తిగా ఉన్నాం. ఈ సీజన్‌లో మరిన్ని ఓవర్లు వేసేందుకు అతడు సిద్ధంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్ వేసేది అతడేనని మైదానంలో దిగే వరకు అతడికి తెలియదు. కానీ ఒత్తిడికి లోనవ్వకుండా బౌలింగ్ చేశాడు. ముందే చెబితే కొంత ఒత్తిడి ఉంటుంది. అలా ఉండకూడదన్నది నా సిద్ధాంతం. ఆట ఎప్పడికప్పుడు కొత్తగా ప్రారంభించినట్లు ఉండాలి.
ఫిట్‌గా ఉన్నా.. కేన్ విలియమ్సన్
చిన్న గాయం నుంచి కోలుకున్నాను. ఇప్పుడు అంతా బాగుంది. మైదానంలో నా ఆట మీద తృప్తిగా ఉన్నాను. ముగిసిన మ్యాచులన్నీ పాఠాలుగా భావిస్తాం. ఈ ఐపీఎల్‌లో ప్రతి జట్టూ అత్యున్నతంగా ఆడాలని ప్రయత్నిస్తుంది. మేమూ మరింత ప్రణాళికాబద్ధంగా ఆడతాం.
మరో 15 పరుగులు చేస్తే బావుణ్ణు.. కేఎల్ రాహుల్
ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టమే. అనుకున్నట్టు ఆడలేకపోయాం. మేం మరికొన్ని పరుగులు చేసి ఉండాల్సింది. ఓ 15 పరుగులు వెనకబడ్డాం. మా బ్యాట్స్‌మెన్ మంచి ఆరంభాలను వృథా చేసుకున్నారు. భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఈ ఓటమి మాకో చక్కని పాఠం. జానీ, వార్నర్‌లు కీలక బ్యాట్స్‌మెన్ అని మాకు తెలుసు. మేం జోడీని విడదీయలేకపోయాం. మా ప్రణాళికలు అంతగా ఫలించలేదు. ఇక నుంచి ప్రతి మ్యాచ్ మాకు కీలకమే. తర్వాతి మ్యాచ్‌లో మేం మరింత పట్టుదలతో పోరాడతాం.