ఐపీఎల్ తాజా సీజన్లో ఓటములతో విసిగిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సంస్కరణల బాట పట్టింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై వేటు వేసింది. కివీస్ సారథి కేన్ విలియమ్సన్‌కు పగ్గాలు అప్పజెప్పింది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో విదేశీ బృందం కూర్పులోనూ మార్పులుంటాయని స్పష్టం చేసింది. దాంతో వార్నర్ స్థానంలో ఎవరొస్తారో అన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగింది!
పోటీలో నలుగురు
ప్రస్తుతం హైదరాబాద్ జట్టులో ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్, కేన్ విలియమ్సన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టోకు తుది జట్టులో చోటు ఖాయం. ఇక మిగిలింది డేవిడ్ వార్నర్, ముజిబుర్ రెహ్మాన్, మహ్మద్ నబీ, జేసన్ రాయ్, జేసన్ హోల్డర్. ఇందులో వార్నర్‌పై వేటు ఖాయమన్న సంగతి తెలిసిందే. రషీద్‌తో పాటు దేశవాళీ స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి ముజీబ్‌కు అవకాశం లేదు. మహ్మద్ నబీకీ చోటు దక్కడం కష్టం. ఇక పోటీ ఎదురవుతోంది జేసన్ రాయ్, జేసన్ హోల్డర్ మధ్యే.
రాయ్ వస్తాడా!
వేటు పడేది వార్నర్‌పై కాబట్టి జేసన్ రాయ్‌కు తుది జట్టులో చోటు ఖాయమేనన్నది విశ్లేషకుల మాట! ఎందుకంటే వార్నర్ తరహాలోనే రాయ్ ఓపెనర్. ఇంగ్లాండ్ జట్టుకు అతడు విధ్వంసకరమైన ఆరంభాలు ఇచ్చాడు. మంచి హిట్టర్. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా బంతుల్ని అలవోకగా స్టాండ్స్‌కు తరలించగలడు. పైగా ఓపెనర్ జానీ బెయిర్‌స్టోతో మంచి అనుబంధం ఉంది. కొన్నాళ్ల క్రితం ముగిసిన టీమ్‌ఇండియా సిరీసులో రాయ్ అద్భుతంగా ఆడాడు. అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 సిరీసులో వరుసగా 49, 46, 9, 40, 0 పరుగులు చేశాడు. పుణెలో నిర్వహించిన వన్డేల్లో 46, 55, 14తో రాణించాడు. ఇక జానీ, రాయ్ కలిసి ఓపెనింగ్ చేసినప్పుడు ఇంగ్లాండ్ సగటు, స్ట్రైక్‌రేట్, విజయాల శాతం మెరుగ్గా ఉండటం గమనార్హం.