తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టెయిన్​ గన్​.. ఉమ్రాన్ బుల్లెట్​.. జమ్ము బౌలర్​కు భారత్​ ఫిదా!​ - ఐపీఎల్​ 2022

IPL 2022 Umran Malik: వకార్‌ యూనిస్‌ను తలపించే యాక్షన్‌... షోయబ్‌ అక్తర్‌, బ్రెట్‌లీలను గుర్తుకు తెచ్చే వేగం..! ఈ  హైదరాబాద్‌ కుర్రాడి బౌలింగ్‌ చూసి ఫిదా కాని వారు ఉండరేమో! టీ20లో అంతలా చెలరేగుతున్నాడు ఉమ్రాన్‌ మాలిక్‌.  మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుగవుతూ.. బుల్లెట్‌ వేగంతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్న 22 ఏళ్ల ఈ జమ్ముకశ్మీర్‌ బౌలర్‌ భారత జట్టు తలుపు దగ్గరే వేచి చూస్తున్నాడు.. మరి ఈ వేగ వీరుడి కథేంటో తెలుసుకుందామా!

Umran Malik
IPL 2022

By

Published : Apr 29, 2022, 8:31 AM IST

IPL 2022 Umran Malik: జమ్ములోని గుజ్జార్‌ నగర్‌కు చెందిన ఉమ్రాన్‌ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తండ్రి పళ్ల దుకాణం నడిపించేవాడు. తనయుడు బాగా చదువుకోవాలని ఆశించాడు. అయితే క్రికెట్‌పై ఉమ్రాన్‌ ఇష్టాన్ని చూసి ప్రోత్సహించాడు. ఉమ్రాన్‌ ఇప్పుడు టీ20లో ఆడుతూ అందరి నోళ్లలో నానుతున్నాడంటే అందుకు కారణం కోచ్‌ రణ్‌దీర్‌ సింగ్‌ మన్హాస్‌. 2017లో జమ్ము జట్టు నెట్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా అక్కడికి వెళ్లిన ఉమ్రాన్‌ తనకు బౌలింగ్‌ అవకాశం కల్పించాలని మన్హాస్‌ను కోరాడు. ఉత్తి కాళ్లతో వచ్చిన 17 ఏళ్ల ఉమ్రాన్‌కు అతడు అవకాశం కల్పించాడు. వేగానికి మెచ్చి అతడికి క్రికెటర్‌గా ఎదిగేందుకు మార్గం చూపించాడు. అప్పటి వరకు ఉమ్రాన్‌కు కోచింగ్‌ లేదు. లెదర్‌ బంతితో ఆడింది లేదు. ప్రైజ్‌మనీ కోసం స్థానికంగా జరిగే టెన్నిస్‌ బాల్‌ టోర్నీలకు వెళ్లేవాడు. అయితే మన్హాస్‌ ప్రోత్సాహంతో బౌలింగ్‌లో మెరుగైన మాలిక్‌.. అండర్‌-19 ట్రయల్స్‌కు ఎంపికయ్యాడు. అప్పటికి బౌలింగ్‌ చేయడానికి సరైన బూట్లు లేకపోవడం వల్ల పక్క ఆటగాళ్లను అడిగి ట్రయల్స్‌లో పాల్గొన్నాడు. ట్రయల్స్‌లో సత్తా చాటి జమ్ముకశ్మీర్‌ తరఫున కూచ్‌ బెహార్‌ టోర్నీలో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మెరుపు వేగంతో అతడు వేసే బంతులకు అందరూ ఆశ్చర్యపడేవాళ్లు. ఒకసారి టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు అజయ్‌ రాత్రా కోచింగ్‌ ఇస్తున్న అసోం రంజీ జట్టు జమ్ముకు వచ్చింది. నెట్స్‌లో ఆ జట్టుకు ఉమ్రాన్‌ బౌలింగ్‌ చేశాడు. కాసేపటికే అతడిని బౌలింగ్‌ ఆపేయాలని రాత్రా కోరాడు. దీనికి కారణం ఉమ్రాన్‌ వేగం! మ్యాచ్‌కు ముందు తమ బ్యాటర్లు ఎక్కడ గాయపడతారోనని రాత్రా భయపడ్డాడట.

వీలైనంత ఎక్కువ వేగంతో బంతిని లెంగ్త్‌లో వేయడమే నా ప్రణాళిక. గుజరాత్‌తో మ్యాచ్‌లో హార్దిక్‌, సాహాలను అలాగే ఔట్‌ చేశా. బంతుల్లో వైవిధ్యాన్ని చూపుతూ వికెట్లకు నేరుగా వేగంగా బంతులేశా. నా వేగాన్ని మరింత పెంచుకోవాలనే లక్ష్యంతో ఉన్నా. ఏదో ఒక రోజు 155 కి.మీ మార్క్‌ అందుకుంటా.

- ఉమ్రాన్‌, సన్​రైజర్స్​ పేసర్

అందుకే ఆ వేగం:ఉమ్రాన్‌ బౌలింగ్‌లో బుల్లెట్‌ వేగానికి అతడి శరీర దృఢత్వమే ప్రధాన కారణం. బలమైన కాళ్లు.. అంతమించిన దృఢమైన శరీరం ఉంటే కచ్చితంగా మంచి పేసర్లు అవుతారని వెస్టిండీస్‌ దిగ్గజ బౌలర్‌ ఆండీ రాబర్ట్స్‌ మాటలు ఉమ్రాన్‌ విషయంలో అక్షర సత్యం. తావి నది ఒడ్డున ఇసుక తిన్నెల్లో పరుగులు పెడుతూ పెరిగిన నేపథ్యమే అతడి శరీరాన్ని బలంగా మార్చింది. ఇసుకలో వేగంగా పరుగెత్తే అలవాటే మైదానంలో ఇంకా వేగంగా ఉరికేలా చేసింది. అందుకే అతడి బౌలింగ్‌ రన్నప్‌ ఆరంభంలో చూసేందుకు చాలా సాధారణంగా ఉంటుంది.. కానీ అడుగులను పరుగుగా మారుస్తూ.. బంతులను బుల్లెట్లుగా విసిరే ఫినిషింగ్‌ చూస్తేనే బ్యాటర్లకు దడ పుడుతుంది. బుమ్రా మాదిరే టెన్నిస్‌ బంతితో మొదలు పెట్టినా కుట్ల బంతితో మెరుపులా బౌలింగ్‌ చేస్తున్నాడు ఉమ్రాన్‌. హైదరాబాద్‌ జట్టులో అతడి స్నేహితుడు అబ్దుల్‌ సమద్‌ ఉండడం ఉమ్రాన్‌కు కలిసొచ్చింది. అతడే ఉమ్రాన్‌ బౌలింగ్‌ వీడియోలను రికార్డు చేసి మార్గనిర్దేశకుడు వీవీఎస్‌ లక్ష్మణ్‌, టామ్‌ మూడీలకు చూపించడం.. అతడ్ని పిలిపించి పరీక్షించడం జరిగిపోయాయి. 2020లో యూఏఈలో జరిగిన టోర్నీలో నెట్‌ బౌలర్‌గా ఎంపికైన ఉమ్రాన్‌...2021 సీజన్‌లో ఆడే అవకాశం దొరికింది.

"ఉమ్రాన్‌ తర్వాతి అడుగు భారత జట్టే. అతడి బౌలింగ్‌లో మెరుపు వేగం ఉంది.. కచ్చితత్వం ఉంది. అతడికి కావాల్సింది భిన్నమైన పిచ్‌లపై బౌలింగ్‌ చేసే అనుభవం. ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్టు, పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఉమ్రాన్‌ను కూడా తీసుకెళ్లాలి. అయితే బుమ్రా, షమి, ఉమేశ్‌, సిరాజ్‌ ఉన్న నేపథ్యంలో తుది జట్టులో అతడికి స్థానం కష్టమే. కానీ ఇలాంటి బృందంతో కలిసి ఉండడం వల్ల, రోహిత్‌, కోహ్లి లాంటి స్టార్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోవడం మాలిక్‌ మరింత మెరుగవుతాడు"

- సునీల్‌ గావస్కర్‌, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

150 కి.మీ వేగంతో..:తొలి సీజన్లో కొన్ని మ్యాచ్‌లే ఆడిన ఉమ్రాన్‌.. సిసలైన తడాఖా చూపించింది మాత్రం ఈ సీజన్‌లోనే! ఈ సీజన్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో వేగంగా బంతులేసినా.. లయ తప్పిన అతడు ఆ తర్వాత గాడిలో పడి బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. గంటకు 150 కి.మీ వేగంతో విసిరే యార్కర్ల నుంచి వికెట్లను కాపాడుకోవడం బ్యాటర్లకు కత్తి మీద సాముగా మారింది. గుజరాత్‌తో పోరులో అయిదు వికెట్లు తీస్తే నలుగురు బ్యాటర్లు ఉమ్రాన్‌ మెరుపు యార్కర్లకు బౌల్డ్‌ అయ్యారు. బంతిని కనెక్ట్‌ చేయడంలో స్టార్‌ బ్యాటర్లే బీట్‌ అవుతున్నారంటే అతడి వేగాన్ని ఊహించొచ్చు. కేవలం వేగమే కాక ఉన్నట్టుండి స్పీడ్‌ తగ్గిస్తూ బ్యాటర్లను బుట్టలో వేస్తున్నాడీ ఫాస్ట్‌బౌలర్‌. డేల్‌ స్టెయిన్‌ లాంటి దిగ్గజం బౌలింగ్‌ హైదరాబాద్‌ కోచ్‌గా ఉండడం మాలిక్‌కు కలిసొచ్చింది. ప్రతి మ్యాచ్‌లో ఫాస్టెస్ట్‌ డెలివరీ అవార్డు ఉమ్రాన్‌కే దక్కుతుందంటే అతడు ఎంత స్థిరంగా వేగంగా బౌలింగ్‌ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.

"ఉమ్రాన్‌ వేస్తున్న వేగం కేవలం టెయిలెండర్లకే కాదు అందరు బ్యాటర్లకు కంగారు పుట్టిస్తోంది. బ్రెట్‌లీ, అక్తర్‌, టెయిట్‌ తర్వాత గంటకు 153-154 కి.మీ మధ్య వేగంతో స్థిరంగా బంతులేసే బౌలర్‌ను ఇతడిలోనే చూస్తున్నా. అయితే ఉమ్రాన్‌ను ఇంకా తీర్చిదిద్దాలి. బీసీసీఐ, ఎన్‌సీఏ పర్యవేక్షణలో అతడు మెరుగవ్వాలి"

- వెటోరి, మాజీ క్రికెటర్

యార్కర్‌, షార్ట్‌ పిచ్‌ బంతులే ఉమ్రాన్‌ ప్రధాన అస్త్రాలు. ఈ సీజన్లో ఇప్పటిదాకా 8 మ్యాచ్‌లు ఆడిన మాలిక్‌ 15.93 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. అయితే ఉమ్రాన్‌కు వయసు ఉంది.. వేగం ఉంది.. కానీ కావాల్సింది స్థిరత్వం, అనుభవం. అతడిని వీలైనన్ని భిన్నమైన పిచ్‌లపై ఆడిస్తే బౌలింగ్‌లో మరింత రాటుదేలడం ఖాయం. టీమ్‌ఇండియాకు ఎంపిక కావడానికి ఉమ్రాన్‌కు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.. కానీ తనలోని పేస్‌కు వైవిధ్యాన్ని జోడించినప్పుడే ప్రపంచం మెచ్చే పేసర్‌ అవుతాడు ఉమ్రాన్‌.

ఇదీ చదవండి:ఉమ్రాన్​ మాలిక్​ కొత్త రికార్డు.. ఆ ప్లేయర్​పై మురళీధరన్​ ఫైర్​!

ABOUT THE AUTHOR

...view details