ఐపీఎల్లో భాగంగా జరగనున్న తుది పోరుకు సమయం ఆసన్నమైంది. మే 28న జరగనున్న ఫైనల్స్ కోసం గుజరాత్లోని నరేంద్రమోదీ స్టేడియం సర్వం సిద్ధమైంది. అయితే మ్యాచ్ టికెట్ల విషయంలో కాస్త అవకతవకలు జరుగుతున్నాయి. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. స్లాట్‌లు తెరిచిన వెంటనే ఆన్‌లైన్ టిక్కెట్లు అమ్ముడవ్వడం వల్ల.. ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోసం అభిమానులు స్టేడియం వద్దకు బారులు తీశారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా ఆ టికెట్లను స్టేడియం దగ్గర వచ్చి తీసుకోవాలని నిర్వాహకులు సూచించారు. దీంతో అక్కడి వాతావరణం కాస్త ఉద్రిక్తతగా మారింది. టికెట్ కౌంటర్ వద్ద గుమిగూడిన జనాల మధ్య తోపులాట ప్రారంభమైంది. కౌంటర్ దగ్గరికి వెళ్లడానికి పోటీ పడటం వల్ల అభిమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. స్టేడియం వద్దకు చేరుకుని తోపులాటను సద్దుమణింగించారు.
ఆన్లైన్లో కన్వేయెన్స్ ఫీజు చెల్లించనప్పటికీ స్టేడియం దగ్గరకు వచ్చి టికెట్ తీసుకోవాలన్న నిబంధనపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ టికెట్ లేకపోతే ఆన్‌లైన్ లో బుక్ చేసుకున్నా.. మ్యాచ్ చూసే అవకాశం ఉండదని చెప్పడంతో ఇంకాస్త మండిపడుతున్నారు. స్టేడియం దగ్గర టికెట్ కౌంటర్లలోనూ ఎన్నో టికెట్లు మిస్ అయినట్లు ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. కౌంటర్ తెరిచిన క్షణాల్లోనే టికెట్లు మాయమైనట్లు కొందరు ట్విటర్ వేదికగా తమ గోడును వెల్లబోసుకున్నారు.