SKY on Kohli sledging:ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్ గురించి ముంబయి ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 2020లో ఇరువురి మధ్య జరిగిన స్లెడ్జింగ్ ఉదంతాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తాను లోపల భయంతో చచ్చిపోయానంటూ చెప్పుకొచ్చాడు. కానీ బయటకు మాత్రం ప్రశాంతంగా ఉన్నట్టు చెప్పాడు.
అసలేమైందంటే?:ముంబయి, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తుండగా.. కోహ్లీ స్లెడ్జ్ చేశాడు. డేల్ స్టెయిన్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ కొట్టిన బంతి.. కోహ్లీ దగ్గరకు వెళ్లింది. బంతిని ఆపిన కోహ్లీ.. కళ్లల్లోకి నేరుగా చూస్తూ సూర్య వైపు నడుస్తూ వచ్చాడు. అయితే, సూర్యకుమార్ వెనక్కి తగ్గలేదు. ఏమాత్రం కదలకుండా.. కోహ్లీకి దీటుగా నిలబడ్డాడు. అనంతరం, స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన కోహ్లీ.. సూర్యకుమార్ యాదవ్‌ను కవ్వించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా దీనిపై ఓ షోలో మాట్లాడాడు సూర్య. ఇప్పటివరకు ఈ విషయంపై బయట చర్చించలేదని చెప్పాడు.
SKY Kohli starring photo:'కోహ్లీది విభిన్నమైన వ్యక్తిత్వం. గ్రౌండ్లో ఉన్నప్పుడు అతడి స్టైల్, ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటాయి. రెండు టీమ్‌లకు ఆ గేమ్ చాలా ముఖ్యం. ఆ మ్యాచ్‌లో కోహ్లీ స్లెడ్జింగ్ మరో స్థాయిలో ఉంది. నేను మాత్రం.. ఏం జరిగినా మ్యాచ్ గెలిపించాలని అనుకున్నా. కోహ్లీ నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చేటప్పుడు మేమిద్దరం చూయింగ్ గమ్ నములుతున్నాం. 'ఏం జరిగినా ఒక్క మాట మాట్లాడకు. పది సెకన్లు ఓపిక పట్టు. ఇంకో ఓవర్ మొదలవుతుంది' అంటూ నాకు నేను చెప్పుకున్నా. అప్పుడే నా బ్యాట్ కింద పడిపోయింది. అది నాకు ఉపయోగపడింది. ఆ తర్వాత మ్యాచ్ ముగిసేవరకు కోహ్లీని చూడలేదు. కిందకు చూస్తూ బ్యాటింగ్ కొనసాగించా. బయట కూడా దీని గురించి ఎప్పుడూ చర్చించలేదు' అని సూర్య చెప్పుకొచ్చాడు.
ఆ మ్యాచ్‌లో సూర్య 43 బంతుల్లోనే 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముంబయిని విజయతీరాలకు చేర్చాడు. గత కొన్నేళ్లుగా ముంబయి తరఫున అద్భుతంగా రాణిస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. కీలక ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌లు గెలిపిస్తున్నాడు. ఈ సీజన్లో ముంబయి వరుస ఓటములు మూటగట్టుకుంటున్నప్పటికీ.. సూర్య మాత్రం అలవోకగా పరుగులు చేస్తున్నాడు.
ఇదీ చదవండి:కొవిడ్ దెబ్బ.. దిల్లీ, పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు