వెన్ను గాయంతో బాధపడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విషయంలో క్రికెట్ అభిమానులు అనుకున్నట్టే జరిగింది. అతడు ఈ ఐపీఎల్ 16వ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతడు విదేశాల్లో శస్త్రచికిత్స చేయించుకుంటాడని.. అందుకే ఈ ఐపీఎల్ మొత్తానికి దూరమవుతాడని బీసీసీఐ వర్గాలు స్పష్టతనిచ్చాయి. ఈ సర్జరీ కారణంగా శ్రేయస్ కనీసం ఐదు నెలలు ఆటకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి కేకేఆర్ టీమ్ అతడు సీజన్ మధ్యలోనైనా తిరిగి వస్తాడని ఎంతగానో ఆశించింది. అప్పటి వరకూ సారథ్య బాధ్యతలను నితీశ్ రాణాకు అప్పగించింది. కానీ శ్రేయస్.. సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడని క్లారిటీ రావడం వల్ల ఆ జట్టుకు గట్టి దెబ్బ తగిలినట్టైంది.
"శ్రేయస్‌కు విదేశాల్లో శస్త్రచికిత్స జరగనుంది. పూర్తిగా కోలుకోవడానికి అతడికి కనీసం ఐదు నెలలు పట్టే అవకాశం ఉంది" అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. ఈ శస్త్రచికిత్స వల్ల జూన్ 7న ఆరంభమయ్యే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు కూడా శ్రేయస్ దూరంకానున్నాడు. ఇప్పటికే అతడు గాయం వల్ల బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులోనూ ఆడలేకపోయాడు. ఆ తర్వాత వన్డే సిరీస్ నుంచి కూడా పక్కకు తప్పుకున్నాడు. కాగా, శ్రేయస్ గైర్హాజరీలో ఐపీఎల్‌లో కోల్‌కతాకు నితీశ్ రాణా నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ విషయానికొస్తే.. ఈ మెగాటోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ ఆడింది. కానీ అందులో పంజాబ్ కింగ్స్ చేతిలో 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ ఫలితాన్ని ప్రకటించారు. ఆ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్(34), నితీశ్ రానా(24), రెహ్మానుల్లా గుర్బాజ్(22) రాణించారు. మిగతా వారు విఫలమయ్యారు. బౌలర్లు కూడా అంతగా ఆకట్టుకోలేదు.
పటిదార్ కూడా..ఇకపోతే బుమ్రా, శ్రేయస్ అయ్యర్, విలియమ్సన్‌ల బాటలోనే మరో ప్లేయర్ కూడా ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ ఆర్డర్ బ్యాటర్ రజత్ పటిదార్.. కాలి మడమ గాయంతో ఈ ఐపీఎల్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. గత సీజన్లో ఎనిమిది మ్యాచ్‌ల్లో 50పైన సగటుతో 333 పరుగులు చేసిన రజత్.. క్వాలిఫయర్-1లో మెరుపు శతకం (112; 54 బంతుల్లో) ఆకట్టుకున్నాడు. మరోవైపు గాయం నుంచి కోలుకుంటున్న ఆర్సీబీ మెయిన్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఏప్రిల్ చివరి వారం వరకు లీగ్‌కు అందుబాటులో ఉండనని తెలిపాడు. ఇంకా ఆర్సీబీకి మరో షాక్ కూడా తగిలింది. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా కింద పడి భుజం స్థానభ్రంశం కావడం వల్ల పేసర్ రీస్ టాప్లీ కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
ఇదీ చూడండి:IPL 2023: గుజరాత్-దిల్లీ మ్యాచ్.. పంత్‌ను చూశారా?