ఆల్‌రౌండర్‌గా కొనసాగడం చాలా కష్టమని చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు రవీంద్ర జడేజా అన్నాడు. ఆదివారం రాత్రి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ 'వన్ మ్యాన్ షో' చేశాడు. బ్యాట్‌తో 62 పరుగులు, బంతితో మూడు వికెట్లు తీసి ఈ సీజన్‌లో బెంగళూరుకు తొలి షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఆల్‌రౌండర్‌గా ఉండటం అంత తేలిక కాదన్నాడు. జట్టు విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించడం బాగుంటుందని, దాన్ని ఆస్వాదించానని చెప్పాడు.
"నా ఫిట్‌నెస్ మీద దృష్టిసారించి చాలా కసరత్తులు చేస్తున్నా. అదృష్టం కొద్దీ అది ఈ మ్యాచ్‌లో కలిసొచ్చింది. ఆల్‌రౌండర్‌గా ఉండటం చాలా కష్టం. అన్ని విభాగాల్లో రాణించాలి. అయితే, నేను సాధన చేసేటప్పుడు ఒకే రోజు మూడు విభాగాల్లో(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) కష్టపడను. ఒక రోజు నైపుణ్యాలపై, మరో రోజు ఫిట్‌నెస్‌పై.. ఇలా ఒక ప్రణాళిక పరంగా సాధన చేస్తా. ఇక ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో దంచి కొట్టాలని నిర్ణయించుకున్నా. మహీభాయ్ కూడా.. హర్షల్ బంతుల్ని ఆఫ్‌స్టంప్ అవతల విసురుతాడని చెప్పాడు. అందుకోసం సిద్ధంగా ఉన్నా. అదృష్టంకొద్దీ అన్నీ కలిసొచ్చి నేను దంచికొట్టాను. దాంతో జట్టు స్కోర్ 191 పరుగులకు చేరింది. నేను బ్యాటింగ్ ఆడే అవకాశం వస్తే ఎక్కువ పరుగులు చేయాలని ముందే అనుకున్నా" అని జడేజా చెప్పుకొచ్చాడు.