తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మంచు కొంప ముంచింది.. కెప్టెన్సీ ఆస్వాదిస్తున్నా'

పంజాబ్​-దిల్లీ మధ్య జరిగిన మ్యాచ్​పై పలువురు క్రికెటర్లు స్పందించారు. స్ట్రైక్​ రేట్ మీద దృష్టి సారించినట్లు శిఖర్​ ధావన్​ వెల్లడించగా.. దిల్లీకి కెప్టెన్సీ చేయడం సంతోషంగా ఉందని పంత్ పేర్కొన్నాడు.

punjab kings vs delhi capitals, rishabh pant, k l rahul
పంజాబ్ కింగ్స్ vs దిల్లీ క్యాపిటల్స్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్

By

Published : Apr 19, 2021, 3:44 PM IST

పంజాబ్‌ కింగ్స్‌ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. శిఖర్‌ ధావన్‌ 49 బంతుల్లో 92 పరుగులు చేసి శివమెత్తాడు. దీంతో మయాంక్‌ (69), రాహుల్‌ (61) శ్రమ వృథా అయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

స్ట్రైక్‌రేట్‌ మీద దృష్టి పెట్టా..

"చాలా రోజులుగా నా ఆట తీరు మెరుగుపరచుకునేందుకు కృషి చేస్తున్నా. ధాటిగా ఆడేందుకు వెనుకంజ వేయడం లేదు. కొత్తగా ప్రయత్నించడానికి భయపడను. నెట్స్‌లో ఎంత బాగా సాధన చేస్తానో.. మ్యాచుల్లోనూ అదే ఆట తీరు అమలు చేసేందుకు ప్రయత్నిస్తా. కొద్ది రోజులుగా లెగ్‌సైడ్‌ షాట్స్‌ ఆడటం సాధన చేస్తున్నా. బౌలర్ల వేగాన్ని నాకు అనుకూలంగా మార్చుకుంటూ ఆడేందుకు ప్రణాళిక వేస్తున్నా. ఒక్కో బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే ఆలోచించుకుంటా. దాన్నే అమలు చేస్తున్నా. ఇటీవల నా స్లాగ్‌ షాట్‌ బాగా మెరుగుపడింది. అందుకు ఆనందంగా ఉంది. పృథ్వీ షాతో ఓపెనింగ్​ను‌ ఆస్వాదిస్తున్నా. ఈ మ్యాచ్‌ నెగ్గడం మరింత ఉత్సాహాన్నిచ్చింది" అని శిఖర్​ ధావన్ పేర్కొన్నాడు.

కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నా..

"దిల్లీ జట్టుకు నాయకత్వం వహించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆరంభంలో మాపై బాగా ఒత్తిడి ఉంది. పిచ్‌ అంతగా సహకరించలేదు. మా బౌలర్లు పంజాబ్‌ను 190 పరుగులకే కట్టడి చేయడం మంచి ప్రదర్శన. ఛేదనలో శిఖర్‌ మాకు పూర్తి ఆధిపత్యం వచ్చేలా ఆడాడు. జట్టు ఎప్పుడూ ఉల్లాసంగా ఉండాలనే కోరుకుంటాను. అలాగే ఆటలోనూ చక్కగా రాణించాలని ఆశిస్తాను" అని దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి:ధావన్​, పృథ్వీ విధ్వంసక బ్యాటింగ్ రహస్యాలివే..

భారీ స్కోరును ఆపాం..

"పది ఓవర్లు అయ్యేసరికి ఈ మ్యాచ్‌లో రాహుల్‌ సేన 250 పరుగులు చేస్తుందేమో అనుకున్నా. కానీ బాగా ఆపగలిగాం. మాలో ధావన్‌ అద్భుతంగా ఆడాడు. గతేడాది ఫామ్​నే కొనసాగిస్తున్నాడు. అతని పరుగుల దాహం ఇంకా తీరలేదు. ఐపీఎల్‌ తొలి అర్ధభాగంలో ప్రతి మ్యాచూ ఫైనల్‌లాగే ఉంటుంది. మరింత మంచి ప్రదర్శన చేయాలి" అని స్టోయినిస్‌ తెలిపాడు.

నా పుట్టినరోజున నెగ్గితే బాగుండేది..

"ఈ మ్యాచ్‌ ఓడిపోవడం కాస్తంత నిరాశగా ఉంది. అయితే మా ఆట తీరు మాత్రం బాగుంది. ఇంకా చాలా మ్యాచులు ఆడాల్సి ఉంది. మంచి ఆటతీరు కనబరుస్తాం. మా స్కోరులో ఓ 15 పరుగులు తక్కువయ్యాయి. అయినా 196 మంచి టార్గెట్‌ అనే భావిస్తున్నా. ధావన్‌ తన ఆటతో విజయాన్ని దిల్లీ వైపు తీసుకెళ్లాడు. వాంఖడేలో మంచు కూడా మాకు ప్రతికూలంగా మారింది. ఛేదనలో మంచు ప్రభావానికి ఏమీ చేయలేకపోతున్నాం. ప్రణాళికల్లో మంచు ప్రభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఛేదన సమయంలో బౌలింగ్‌ చేసే జట్టు బంతిని మార్చుకునే వెసులుబాటు ఉంటే బాగుంటుంది" అని కేఎల్​ రాహుల్ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:భారత బాక్సర్ల సత్తా- నాలుగు పతకాలు ఖాయం!

ABOUT THE AUTHOR

...view details