భారతదేశం కరోనాతో తల్లడిల్లుతున్న నేపథ్యంలో కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరా కోసం దిగ్గజ క్రికెట్ సచిన్ తెందూల్కర్ రూ.1 కోటి విరాళాన్ని ప్రకటించాడు. ఆరోగ్య వ్యవస్థపై చాలా భారం పడిన నేపథ్యంలో కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు తన వంతు సాయంగా అందిస్తున్నట్లు తెలిపాడు.
"కరోనా సెకండ్ వేవ్‌తో ఆరోగ్య వ్వవస్థపై చాలా భారం పడింది. చాలా మంది కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించడం అత్యవసరం" అని సచిన్ ట్వీట్ చేశాడు.
అంతకుముందు కరోనా బాధితులను ఆదుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ కూడా ముందుకొచ్చింది. కొవిడ్-19 సహాయ చర్యల కోసం రూ.7.5 కోట్ల విరాళం ప్రకటించింది. "కొవిడ్ బాధితుల సహాయం కోసం రాజస్థాన్ రాయల్స్ తరఫున రూ.7.5 కోట్లు ప్రకటిస్తున్నాం. ఆటగాళ్లు, జట్టు యజమానులు, జట్టు మేనేజ్‌మెంట్ ఈ మొత్తాన్ని సేకరించడంలో భాగమయ్యారు. బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్ కూడా ఇందులో ఉంది" అని రాజస్థాన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
మరోవైపు దిల్లీ క్యాపిటల్స్ రూ.1.5 కోట్లు ప్రకటించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ ప్యాట్ కమిన్స్ కొవిడ్ బాధితుల సహాయం కోసం 50 వేల డాలర్లు ప్రకటించాడు.
ఇదీ చూడండి..ఈ రికార్డుల రారాజుకు తీరని కల అదొక్కటే!