ఐపీఎల్ 16వ సీజన్ ఫస్టాఫ్‌లో ముంబయి ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పెద్దగా మెరవలేదు. వరుస డకౌట్లతో ఇబ్బంది పడ్డాడు. అయితే సెకండాఫ్‌లో కాస్త గాడిన పడిన అతడు తాజాగా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తన హిట్టింగ్తో 'స్కై' అని మరోసారి నిరూపించాడు. దీంతో అతడు ఫామ్‌లోకి వచ్చాడంటే ఆపడం కష్టమని అర్థమవుతుంది. 200 పరుగుల భారీ లక్ష్యం ఎదురుగా ఉన్నప్పటికీ కనిపిస్తున్నా సూర్య అస్సలు ఏమాత్రం బెదరలేదు. తన బ్యాటుతో బంతిని బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 26 బంతుల్లో 50 మార్క్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత 9 బంతుల్లో 33 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలా మొత్తంగా 35 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్య తన తర్వాతి మ్యాచుల్లో ఇలానే తన విధ్వంసాన్ని కొనసాగిస్తే.. ముంబయి ఇండియన్స్‌ను ఆపడం కష్టమనే చెప్పాలి. ఇకపోతే ఆర్సీబీపై భారీ విజయంతో నెట్ రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగుపరుచుకున్న ముంబయి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది. ఈ సీజన్లో టాప్-4లోకి రావడం ముంబయికి ఇదే ఫస్ట్ టైమ్. గత నాలుగు మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు ఇది మూడో విజయం. ఈ మ్యాచ్‌లో ఓడిన రాయల్ ఛాలెంజర్స్.. తన ఆరో పరాజయంతో ప్లేఆఫ్స్ అవకాశాలను కష్టతరం చేసుకుంది.
రోహిత్ చెత్త రికార్డు.. ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 8 బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేసి హసరంగా బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే అతడు ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అవడం హిట్‌మ్యాన్‌కు ఇదే ఫస్ట్‌టైమ్. ఈ సీజన్లో రోహిత్ గత ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా 2,3,0,0,7 పరుగులు మాత్రమే చేశాడు. గతంలో 2017 ఐపీఎల్ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యాడు రోహిత్. తాజాగా తన చెత్త రికార్డును తానే అధిగమించాడు. ఇప్పుటివరకు ఈ సీజన్లో 11 మ్యాచులు ఆడిన రోహిత్.. 191 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ బాదాడు.