ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసార హక్కులు దక్కించుకునేందుకు రిలయన్స్(reliance Ipl broadcast) భారీ ప్రణాళికతో రానుందని తెలిసింది. ఈ మేరకు కార్యచరణ సిద్ధమైందని సమాచారం. ఇప్పటికే ప్రత్యర్థి బ్రాడ్‌కాస్టింగ్ సంస్థల నుంచి సీనియర్లను తీసుకుందని అంటున్నారు. ఈ ఏడాది ఆఖర్లో నిర్వహించే ఐపీఎల్ బిడ్డింగ్‌నూ ఎలాగైనా గెలుచుకోవాలని పట్టుదలతో ఉందని తెలుస్తోంది.
నెట్‌వర్క్ 18, రిలయన్స్ జియో(reliance jio Ipl) సంయుక్తంగా ఐపీఎల్‌ను ప్రసారం చేసేందుకు సర్వం సిద్ధమైందని ఈ4ఎం నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఐపీఎల్ ప్రసార హక్కులు డిస్నీ స్టార్ ఇండియా వద్ద ఉన్నాయి. 2022తో ఒప్పందం ముగుస్తుంది. బిడ్డింగ్స్ ద్వారా కొత్త ప్రక్రియ ఈ ఏడాది ఆఖర్లో ఆరంభమవుతుంది. డిస్నీ స్టార్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్, అమెజాన్ ఇండియా కూడా హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ పడనున్నాయి. రిలయన్స్ నుంచి సరికొత్త క్రీడా ఛానల్ రాబోతోందని ఈ4ఎం చెబుతోంది. ఇప్పటికే ఫుట్‌బాల్ లీగ్ 'లా లిగా' ప్రసార హక్కుల్లో వయాకామ్ మెజారిటీ వాటా దక్కించుకొందని గుర్తు చేస్తోంది. ఎంటీవీ, వూట్‌లో లీగ్ ప్రసారం అవుతోంది.