ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఆర్సీబీ ముంబయి మ్యాచ్‌కు సర్వం సిద్ధమయ్యింది. కానీ ఇంతలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఓ గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే టీమ్‌లోని స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ కొన్ని మ్యాచ్‌లకు దూరమవ్వగా.. తాజాగా టాప్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా కూడా అదే బాట పట్టాడు. అంతర్జాతీయ షెడ్యూలింగ్ కారణంగా ఐపీఎల్‌కు హసరంగ దూరమవ్వడం ఆర్సీబీకి ఇప్పుడు ఇబ్బందిగా మారింది. అతడు ఏప్రిల్ 9 వరకు అందుబాటులో ఉండటం కష్టమని ఆర్‌సీబీ ప్రధాన కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు. ఆదివారం ముంబయితో బెంగళూరు తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో హేజిల్‌వుడ్ స్థానంలో ఇంగ్లాండ్ పేసర్ రీస్ టోప్లేను తీసుకున్నట్లు బంగర్ వెల్లడించాడు.
మరోవైపు ఆర్సీబీకి చెందిన మరో యంగ్ ప్లేయర్ రజత్ పటీదార్ కూడా సగం మ్యాచ్‌లకు హాజరు కాలేడు. ఇప్పటికీ అతడి గాయంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు. కాగా, ఆసీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాత్రం ముంబయితో మ్యాచ్‌లో ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన ఆల్‌రౌండర్ విల్ జాక్స్ స్థానంలో కివీస్ ఆటగాడు బ్రాస్‌వెల్‌ను తీసుకుంటున్నట్లు తెలిపారు. సొంత మైదానంలో ఆడేందుకు ఆటగాళ్లంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారని బంగర్ తెలిపారు.