ఐపీఎల్ 14వ సీజన్లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటికే మూడు విజయాలను సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. గెలుపు, ఓటములతో దోచులాడుతోంది రాజస్థాన్ రాయల్స్. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడిపోయింది. ఈ రెండు జట్ల మధ్య నేడు వాంఖడే వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇరుజట్లు గెలుపు కోసం ఉత్సాహంగా ఉన్నాయి.
రాజస్థాన్ నిలుస్తుందా?
బ్యాటింగ్ విభాగంలో రాజస్థాన్ రాయల్స్ ప్రదర్శన ఏమంత బాగోలేదనే చెప్పాలి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో అలరించాడు సంజూ శాంసన్. కానీ జట్టును గెలిపించలేకపోయాడు. అలాగే దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాళ్లు మిల్లర్, మోరిస్ జట్టుకు విజయాన్ని అందించారు. బట్లర్ చెన్నైతో మ్యాచ్‌లో అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ మిగతా వారు విఫలమయ్యారు. ఏది ఏమైనప్పటికీ బ్యాటింగ్‌లో జట్టు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది.
బౌలింగ్‌లో కూడా రాజస్ధాన్ మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. జయదేవ్ ఉనద్కత్, చేతన్ సకారియా మెప్పిస్తున్నా మిగతా వారు కూడా వారికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా లీగ్ నుంచి తప్పుకోవడం వల్ల క్రిస్ మోరిస్, ముస్తాఫిజుర్ రెహ్మన్‌పై అధిక భారం పడనుంది.