రాజస్థాన్ ప్లేఆఫ్స్ ఆశలు(IPL 2021) సజీవం. రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు అదరగొట్టింది. శివమ్ దూబే, యశస్వి జైశ్వాల్ విధ్వంసం సృష్టించిన వేళ.. భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి, టేబుల్ టాపర్ చెన్నైని(CSK vs RR) చిత్తుగా ఓడించింది. 12 మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కు ఇది అయిదో విజయం. ప్లేఆఫ్స్ కోసం పోటీలో ఉండాలంటే మిగతా రెండు మ్యాచ్‌ల్లోనూ రాయల్స్ గెలవాల్సిందే.
మూడు వరుస ఓటముల తర్వాత రాజస్థాన్ రాయల్స్(rajasthan royals team 2021) విజయాన్నందుకుంది. యశస్వి జైశ్వాల్ (50; 21 బంతుల్లో 6×4, 3×6), శివమ్ దూబే (64 నాటౌట్; 42 బంతుల్లో 4×4, 4×6) చెలరేగడంతో శనివారం 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌ను మట్టికరిపించింది. రుతురాజ్ గైక్వాడ్ (101 నాటౌట్; 60 బంతుల్లో 9×4, 5×6) విధ్వంసం సృష్టించడంతో మొదట చెన్నై 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. జడేజా (32 నాటౌట్; 15 బంతుల్లో 4×4, 1×6) మెరిశాడు. జైశ్వాల్, దూబేల భీకర బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని రాజస్థాన్ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఐపీఎల్-14 యూఏఈ అంచెలో చెన్నైకి ఇదే తొలి ఓటమి.
ధనాధన్ ఛేదన:
లక్ష్యం పెద్దదే అయినా రాజస్థాన్ అలవోకగా పని పూర్తి చేసింది. ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఓపెనర్లు జైశ్వాల్, లూయిస్ పోటీ పడి దంచడంతో రాజస్థాన్ 5 ఓవర్లకే 75/0తో నిలిచింది. హేజిల్‌వుడ్ వేసిన రెండో ఓవర్లో రాయుడు క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన జైశ్వాల్.. అదే బౌలర్ వేసిన అయిదో ఓవర్లో వరుసగా 6, 6, 4, 6 దంచేశాడు. ఓపెనర్లిద్దరూ రెండు పరుగుల తేడాతో నిష్క్రమించినా.. చెన్నైకి ఎలాంటి ఉపశమనం లేకపోయింది. శివమ్ దూబే మరింతగా రెచ్చిపోయాడు. మరోవైపు కెప్టెన్ శాంసన్ సహకరిస్తుండగా.. నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. బలమైన షాట్లతో భారీ సిక్స్‌లు బాదుతూ జట్టును వడివడిగా లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. 13 ఓవర్లకు స్కోరు 153/2. మిగిలిన పని పూర్తి చేయడానికి రాజస్థాన్ పెద్దగా శ్రమపడలేదు. జట్టు స్కోరు 170 వద్ద శాంసన్ ఔటైనా.. ఫిలిప్స్ (14 నాటౌట్)తో కలిసి దూబే రాజస్థాన్‌ను విజయతీరాలకు చేర్చాడు. దూబే 31 బంతుల్లోనే అర్ధశతకాన్ని అందుకున్నాడు. దూబే.. శాంసన్‌తో మూడో వికెట్‌కు 89 పరుగులు జోడించాడు.
మెరిసిన రుతురాజ్:
చెన్నై ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రుతురాజ్ ఆటే హైలైట్. చెన్నై టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. రుతురాజ్, డుప్లెసిస్ (25) ఆరంభంలో జాగ్రత్తగా ఆడారు. 5 ఓవర్లకు స్కోరు 34 పరుగులే. తర్వాత కూడా పరుగులు వేగంగా ఏమీ రాలేదు. 10 ఓవర్లు ముగిసే సరికి డుప్లెసిస్, రైనా (3) వికెట్లు కోల్పోయిన చెన్నై 63/2తో నిలిచింది. అయితే ఏకాగ్రత చెదరని రుతురాజ్ క్రమంగా దూకుడు పెంచి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్స్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కాసేపు సహకరించిన మొయిన్ అలీ (21) ఔటైనా, రాయుడు (2) విఫలమైనా.. రుతురాజ్ మాత్రం దూకుడు కొనసాగించాడు. 18వ ఓవర్లో ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో మిడ్‌వికెట్లో సిక్స్‌తో 90ల్లో అడుగుపెట్టిన రుతురాజ్.. అతడే వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో చివరి బంతికి సిక్స్‌తో శతకాన్ని అందుకున్నాడు. టీ20ల్లో రుతురాజ్‌కు ఇదే తొలి సెంచరీ. జడేజా రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదడంతో 20వ ఓవర్లో మొత్తం 22 పరుగులొచ్చాయి. రుతురాజ్ తన చివరి 30 బంతుల్లో 70 పరుగులు చేయడం విశేషం. చివరి 8 ఓవర్లలో చెన్నై ఏకంగా 106 పరుగులు రాబట్టింది. జడేజా, రుతురాజ్ అభేద్యమైన అయిదో వికెట్‌కు 55 పరుగులు జోడించారు.