IPL 2023 Final CSK VS GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 తుది అంకానికి రంగం సిద్ధమైంది. లీగ్, ప్లే ఆఫ్స్ స్టేజ్‌లు ముగిశాయి. దీంతో క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. గ్రూప్ స్టేజ్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్తో టాప్-2లో నిలిచిన రెండు జట్ల మధ్యనే మరికాసేపట్లో టైటిల్ పోరులో తలపడనన్నాయి. నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్కే.. నిరుడు ఐపీఎల్‌లో అడుగు పెట్టగానే ఛాంపియన్‌గా అవతరించిన గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి(Chennai Super Kings vs Gujarat Titans). జట్టు సమష్టితో, నిలకడ ప్రదర్శనతో విజయాలను ఖాతాలో వేసుకుంటూ ఫైనల్ వరకు వచ్చిన ఈ రెండు జట్లూ.. ఇప్పుడు అదే ఒరవడితో కప్పు నెగ్గాలన్న పట్టుదలతో ఉన్నాయి.
దీంతో ఈ సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారా అని అభిమానుల్లో ఉత్కంఠత నెలకొంది. అయితే ఈ రసవత్తర పోరు మరికొద్దిసేపట్లో ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పుడు ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం మైదానంలో భారీ వర్షం కురుస్తోంది. ప్రస్తుతానికైతే ఆగేట్టు కనపడట్లేదు. టాస్ కూడా డిలే అయింది. దీంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణ పరిస్థితి ఏంటి? విజేతను ఎలా నిర్ణయిస్తారు? రూల్స్ ఏం చెబుతున్నాయి? తెలుసుకుందాం..
Rain rules IPL :నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
- ఒక్కో జట్టుకు కనీసం 5 ఓవర్ల ఆట సాధ్యంకాకపోతేనే మ్యాచ్ రిజర్వ్‌డేకు వెళ్తుంది.
- ఒకవేళ కనీసం ఒక్క బంతి పడినా.. రిజర్వ్‌డే రోజు అక్కడి నుంచే మ్యాచ్ కొనసాగుతుంది.
- ఒకవేళ టాస్ పడి.. ఒక్క బంతి కూడా పడకపోతే.. రిజర్వ్‌డే రోజు మళ్లీ కొత్తగా మ్యాచ్ ప్రారంభమవుతుంది.
- రిజర్వ్‌డే రోజు కూడా టాస్ మళ్లీ వేస్తారు. కెప్టెన్లు కూడా తమ జట్లను మార్చుకునే ఛాన్స్ ఉంటుంది.
- ఒకవేళ రిజర్వ్‌డే రోజు కూడా ఆట సాధ్యం కాకపోతే.. పాయింట్స్ టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా అనౌన్స్ చేస్తారు. కనీసం సూపర్ ఓవర్ నిర్వహించాలి అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 1:20 వరకు సమయం ఉంటుంది.
గుడ్ న్యూస్.. రిజర్వ్ డే ఉంది
స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం ఇంకా జోరుగా కురుస్తూనే ఉంది. ఒక వేళ వర్షం తగ్గకపోతే మ్యాచ్ పరిస్థితి ఏంటని అభిమానులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. ఫైనల్‌కు రిజర్వ్ డే ఉందా లేదా అని గందరగోళానికి గురౌతున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం.. రిజర్వ్ డే ఉన్నట్లు తెలిసింది. వర్షం వల్ల ఇవాళ మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే రేపు ఫైనల్‌ను నిర్వహిస్తారు.