స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో ట్రోఫీ. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన చెన్నై సూపర్‌కింగ్స్.. నాలుగోసారి సగర్వంగా ఐపీఎల్ కప్‌ను ముద్దాడింది. గతేడాది ఇదే చోట టోర్నీలో ఘోరంగా విఫలమైన ఈ జట్టు.. సరిగ్గా ఏడాదిలో కప్పు కొట్టి విమర్శకుల నోళ్లు మూయించింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం చెన్నై జట్టు గురించి, తన ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ధోనీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"ఇంతకు ముందే చెప్పా. ఇప్పుడు మరోసారి చెబుతున్నా. ఐపీఎల్లో నేను ఆడేది లేనిది బీసీసీఐ రిటెన్షన్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. కొత్తగా రెండు జట్లు వస్తున్నాయి. ఈ సమయంలో నా రిటైర్మెంట్ గురించి కాదు చెన్నై జట్టుకు ఏది మంచిదో అదే చేస్తాను. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలవడం ముఖ్యం కాదు. ఏ సీజన్లోనూ ఇబ్బంది పడకుండా ఉండే ఆటగాళ్లు బృందాన్ని తయారు చేయడం ముఖ్యం. రాబోయే 10 ఏళ్ల కోసం చెన్నై జట్టులో ఉండే ఆటగాళ్ల కోసం మేం ప్రస్తుతం చూస్తున్నాం" అని ధోనీ అన్నాడు.
"ఈ సీజన్‌లోని ప్రతి మ్యాచ్‌లోనూ మా జట్టు నుంచి ఒక్కో ఆటగాడు మ్యాచ్ విన్నర్‌గా నిలవడం ఆనందంగా ఉంది. ప్రతి ఫైనల్ ప్రత్యేకం. మీరు గణాంకాలు గమనిస్తే ఎక్కువసార్లు ఫైనల్లో ఓడింది మేమే అని తెలుస్తుంది. అందుకే ఎలాగైనా సరే దానిని అధగమించి, గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూశాం" అని ధోనీ చెప్పాడు.