నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్‌ను యుఏఈలో సెప్టెంబరులో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్.. ఈ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌ల్ని యూకేలో జరపాలని అన్నాడు.
ప్రపంచటెస్టు ఛాంపియన్షిప్(జూన్ 18-22) సహా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్(ఆగస్టు 4-సెప్టెంబరు 14) ఆడేందుకు టీమ్ఇండియా, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అది పూర్తవ్వగానే అక్టోబరు-నవంబరులో భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ రెండింటి మధ్యలోనే ఐపీఎల్ రెండో దశ నిర్వహించాలని యోచిస్తోంది బీసీసీఐ. కాబట్టి మెగాలీగ్ను తమ వద్ద నిర్వహించడం వల్ల ఇంగ్లాండ్, భారత్ ఆటగాళ్లు టెస్టు సిరీస్ పూర్తవ్వగానే ఎటూ ప్రయాణించకుండా అక్కడే ఆడొచ్చనే ఆలోచనతో అన్నాడు పీటర్సన్.
"సెప్టెంబరులో ఇంగ్లాండ్-భారత్ టెస్టు సిరీస్ పూర్తవ్వగానే ఇరు జట్ల ఉత్తమ ఆటగాళ్లు అక్కడే అందుబాటులో ఉంటారు. కాబట్టి యూకేలోనే ఐపీఎల్ నిర్వహించడం మంచిదని నా అభిప్రాయం."