కొవిడ్ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి ఆటగాళ్లు ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్న వేళ దిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. ఇప్పుడు బయో బబుల్ లాంటి సురక్షితమైన ప్రదేశం మరొకటి లేదని అభిప్రాయపడ్డాడు. బయట పరిస్థితులు అత్యంత భయంకరంగా ఉన్నాయని తెలిపాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను స్వాగతించాల్సిందేనని పేర్కొన్నాడు.
"విరామ సమయాల్లో నేను తరచుగా ఆటగాళ్లతో మాట్లాడతాను. బయటి పరిస్థితులు ఎలా ఉన్నాయి.. మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారని అడుగుతుంటాను. అది చాలా ముఖ్యం కూడా. ఐపీఎల్ వల్ల మేము సురక్షితమైన ప్రదేశంలో ఉన్నాము. తాజా పరిస్థితుల్లో లీగ్ అనేది ప్రజలకు ఎంతో కొంత ఆనందాన్ని ఇస్తుందనుకుంటున్నాను."
-రికీ పాంటింగ్, దిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్.
"ఇన్ని రోజులు కుర్రాళ్లు చెన్నైలో సొంత గడ్డపై ఉన్నారు. అయినా కుటుంబ సభ్యులను కలవలేకపోయారు. ఇది చాలా క్లిష్టమైన అంశం. సన్‌రైజర్స్‌తో మ్యాచ్ అనంతరం అశ్విన్ లీగ్‌ను వీడుతున్నట్లు తెలిపాడు. తమ కుటుంబ సభ్యులు కరోనా పోరాడుతున్నారని వెల్లడించాడు" అని దిల్లీ కోచ్ చెప్పాడు.