PBKS vs SRH: ఐపీఎల్ మెగా లీగ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ నిప్పులు చెరిగారు. తొలి ఓవర్లలో భూవి కీలక వికెట్లు పడగొట్టగా.. చివరి ఓవర్లో మూడు వికెట్లు తీసి పంజాబ్‌ను కట్టడి చేశాడు ఉమ్రాన్. హైదరాబాద్ బౌలర్లు రాణించటం వల్ల పెద్ద స్కోర్ సాధించటంలో పంజాబ్ బ్యాటర్లు తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి హైదరాబాద్ ముందు 152 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. లియామ్ లివింగ్‌స్టోన్ (33 బంతుల్లో 60 పరుగులు) మినహా మిగతా బ్యాటర్లు తక్కువ సోర్లకే వెనుదిరిగారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది హైదరాబాద్. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన శిఖర్ ధావన్‌ను(8) మూడో ఓవర్లోనే పెవీలియన్ చేర్చాడు భూవి. ఆ తర్వాత ఐదో ఓవర్లో 14 పరుగులు చేసిన మరో ఓపెనర్ ప్రభసిమ్రాన్ నటరాజన్ బౌలింగ్‌లో పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బెయిర్‌స్టో సైతం ఎక్కువ సేపు క్రీజులు నిలబడలేకపోయాడు. అయితే.. లివింగ్‌స్టోన్ వికెట్లు పడుతున్నప్పటికీ తడబడకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ నాలుగు వికెట్లు పడగొట్టి పంజాబ్ నడ్డి విరిచాడు. భువనేశ్వర్ 3 కీలక వికెట్లు తీయగా.. నటరాజన్, జగదీశా సుచిత్ తలో వికెట్ తీశారు.