టీమ్‌ఇండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇంగ్లాండ్ పర్యటనకు చురుగ్గా సన్నద్ధమవుతున్నాడు. ఇంట్లోనే కసరత్తులు చేస్తూ... ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రిషభ్ పంత్ దిల్లీ క్యాపిటల్స్‌కు చక్కగా సారథ్యం వహించాడు. లీగ్ నిరవధికంగా వాయిదా పడటం వల్ల అతడు ఇంటికి చేరుకున్నాడు. బయట పరిస్థితులు బాగా లేనందున ఎక్కడికీ వెళ్లడం లేదు. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాడు. జిమ్‌లు లేకపోవడం, క్రీడా మైదానాలు మూసేయడం వల్ల ఇంటివద్దే కసరత్తులు చేస్తున్నాడు.
ఇంటి వద్ద ఉన్న మైదానంలో గడ్డిని చదును చేసే మూవర్‌ను అటు ఇటూ తిప్పుతున్న వీడియోను పంత్ ట్వీట్ చేశాడు. 'యే దిల్ మాంగే "మూవర్"! క్వారంటైన్‌కు విరామం ఇవ్వక తప్పలేదు. అయితే ఇందోర్‌లో చురుగ్గా ఉండేందుకు ప్రయత్నించడం సంతోషకరం. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి' అని క్యాప్షన్ పెట్టాడు.
ఇంగ్లాండ్ పర్యటనలో రిషభ్ పంత్ అత్యంత కీలకం కానున్నాడు. జట్టుకు అతడు ఎక్స్ ఫ్యాక్టర్‌గా ఉంటున్నాడు. ఒత్తిడి చిత్తు చేస్తున్నా దూకుడుగా బ్యాటింగ్ చేయగల అతడి సామర్థ్యం కోహ్లీసేనకు కొండంత బలం. గతంలోనూ అతడు ఇంగ్లాండ్ సిరీసులో పరుగుల వరద పారించాడు. అంతేకాకుండా ఆసీస్‌లో సిరీసు గెలిపించాడు. ఇప్పుడు మరో సారి ఆంగ్లేయులపై ఆధిపత్యం చెలాయించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇదీ చదవండి:కొవిడ్‌తో అర్జున అవార్డు గ్రహీత చంద్రశేఖర్ మృతి