IPL 2023 Winner : అనూహ్య పరిణామాల మధ్య ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా ఫైనల్.. రిజర్వ్ డేకు వాయిదా పడిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. వర్షం కారణంగా చెన్నై ఇన్నింగ్స్‌ను 15 ఓవర్లకు కుదించినా.. చివరి బంతి వరకు ఫలితం తేలలేదు. చివరి రెండు బంతుల్లో జడేజా సిక్సర్, ఫోర్ బాదడం వల్ల చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఐదు టైటిల్స్ గెలిచిన రెండో జట్టుగా సీఎస్‌కే నిలిచింది. ముంబయి రికార్డును సమం చేసి రికార్డు సృష్టించింది. చెన్నై విజయంలో కీలకంగా వ్యవహరించిన రవీంద్ర జడేజాను ఎంఎస్ ధోని ఎత్తుకుని చేసుకుని సంబరాలు చేసుకున్నాడు. అయితే ఇదే తన చివరి ఐపీఎల్ అని భావించిన అభిమానులకు ధోనీ శుభవార్త చెప్పాడు. మ్యాచ్ అనంతరం వ్యాఖ్యాత హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కష్టపడైనా.. వచ్చే సీజన్లో ఆడాలి!
MS Dhoni Retirement IPL : 'నా రిటైర్మెంట్‌పై సమాధానం కోసం వేచి చూస్తున్నారా..? దీనిపై ప్రకటన చేయడానికి ఇదే సరైన సమయం. కానీ, ఈ ఏడాది ఎక్కడికి వెళ్లినా నేను ప్రేక్షకుల అభిమానాన్ని పొందాను. ఈ సమయంలో అందరికీ ధన్యవాదాలు చెప్పడం చాలా సులభం. అయితే, నాకు కష్టమైన విషయం ఏమిటంటే.. మరో 9 నెలలు కష్టపడి కనీసం వచ్చే సీజన్‌లోనైనా ఆడాలి. ఇదంతా నా శరీరంపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది. ఐపీఎల్ టైటిల్‌ని మా బృందం నాకు బహుమతిగా ఇచ్చింది. వాళ్లు నాపై చూపిన ప్రేమకు.. ఇంకా నేను చేయాల్సిన బాధ్యతలున్నాయనిపిస్తోంది.'
అప్పుడు కళ్లలో నీళ్లు తిరిగాయి..'నా కెరీర్ చివరి దశ కావడం వల్ల కాస్త ఎమోషనల్ అయ్యాను. తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగినప్పుడు అభిమానులు నా పేరుతో నినాదాలు చేయడం వల్ల భావోద్వేగానికి గురయ్యాను. డగౌట్‌లో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ సీజన్‌ని ఆస్వాదిస్తూ ఆడాలని అనుకున్నా. ఇక చెన్నై జట్టు పరిస్థితి కూడా ఇదే. తిరిగి వచ్చి మళ్లీ ఆడేందుకు సాధ్యమైనదంతా చేస్తాను. నన్ను, నా ఆటను చూసేందుకు వచ్చిన అభిమానులకు రుణపడి ఉంటాను. అదే సమయంలో నా వ్యక్తిత్వం ఎప్పటికీ మారదు. ఒక్కో ట్రోఫీ ఒక్కోలా ఉంటుంది. అయితే ఐపీఎల్ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి మ్యాచ్‌లోనూ ఉత్కంఠ. దానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.'
ఆ ప్లేయర్ స్పెషల్..
Ambati Rayudu Retirement IPL : 'ఫైనల్ మ్యాచ్‌లో కూడా మా బౌలింగ్ విభాగం గాడి తప్పింది. కానీ బ్యాటింగ్ విభాగం మాత్రం ఒత్తిడిని తట్టుకుని నిలబడింది. నేను మాత్రం నిరాశ పరిచాను. జట్టులో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా రాణించేందుకు కృషి చేస్తారు. అజింక్యా రహానెతో సహా కొందరికి మంచి అనుభవం ఉంది. మరీ ముఖ్యంగా అంబటి రాయుడు మైదానంలో వంద శాతం ఎఫర్ట్ పెట్టే ఆటగాడు. కానీ, అతడు ఉంటే, నేను ఫెయిర్ ప్లే అవార్డును గెలుచుకునేవాడిని కాదు (నవ్వుతూ). అతడు అద్భుతమైన క్రికెటర్. అతడితో చాలా కాలం ఆడిన అనుభవం నాకు ఉంది. ఇండియా- ఏ జట్టు నుంచి అతడు నాకు తెలుసు. స్పిన్, పేస్‌ను రాయుడు అద్భుతంగా ఆడతాడు. ఈ ఫైనల్ మ్యాచ్‌లోనూ అతడు తన సత్తా చాటాడు. నాలాగే రాయుడు కూడా ఫోన్ ఎక్కువగా వాడడు. కెరీర్‌ను అద్భుతంగా ముగించిన రాయుడు.. తర్వాతి దశను సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను' అని ధోనీ చెప్పుకొచ్చాడు.