తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అర్జున్​కు ఆ క్లారిటీ ఉంది'.. తెందూల్కర్ తనయుడిపై రోహిత్ ప్రశంసల జల్లు - అర్జున్​ తెందూల్కర్​ ముంబయి ఇండియన్స్​

ముంబయి ఇండియన్స్ యువ ప్లేయర్​ అర్జున్​ తెందూల్కర్​ను ఆ జట్టు కెప్టెన్ రోహిత్​ శర్మ కొనియాడాడు. మంగళవారం ముంబయి సన్​రైజర్స్​ మధ్య జరిగిన మ్యాచ్​లో ఈ యువ ప్లేయర్​ తీసిన వికెట్​కు మురిసిపోయిన రోహిత్​.. మ్యాచ్​ అనంతరం అతన్ని ప్రశంసలతో ముంచెత్తాడు.

rohit sharma
rohit sharma

By

Published : Apr 19, 2023, 10:19 AM IST

ఐపీఎల్‌ 16వ సీజన్​లో అర్జున్ తెందూల్కర్ తన తొలి వికెట్ తీశాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ను పెవిలియన్​ బాట పట్టించి.. తొలి వికెట్​ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు రెండు ఓవర్లలోనూ అద్భుతంగా బౌలింగ్ చేసిన ఈ జూనియర్ తెందూల్కర్.. సరైన లైన్, లెంగ్త్‌లో బౌలింగ్ చేసి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. దీంతో ముంబయి ఇండియన్స్​ కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందంలో మునిగిపోయాడు. ఈ యువ ఆటగాడిని​ ప్రశంసలతో ముంచెత్తాడు.

"మూడు సంవత్సరాలుగా అర్జున్ ఈ జట్టులో ఓ భాగంగా ఉన్నాడు. అతను చేయాలనుకుంటున్న విషయంపై తనకు పూర్తి అవగాహన ఉంది. అతను తన ప్లాన్స్​ విషయంలో క్లారిటీగానే ఉన్నాడు. తన కొత్త బంతిని స్వింగ్ చేయడంతో పాటు డెత్ వద్ద యార్కర్లు వేయడానికి ప్రయత్నిస్తున్నాడు." అంటూ రోహిత్​.. అర్జున్​ను కొనియాడాడు. అదే సమయంలో ముంబయి టీమ్​కు చెందిన మరో యంగ్​ ప్లేయర్​ తిలక్​ వర్మను కూడా ప్రశంసించాడు.

"మా టీమ్​లో సుదీర్ఘ బ్యాటింగ్ లైనప్ ఉంది. ప్లేయర్లందరూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. గత సీజన్‌లో తిలక్‌ని చూశాము. అతను ఏమి చేయగలడో మా అందరికీ తెలుసు. అతని ఆట తీరు నాకు చాలా ఇష్టం. త్వరలోనే అతను చాలా జట్లకు ఆడటాన్ని మనం చూస్తాము". అని రోహిత్​ అన్నాడు.

సన్​రైజర్స్​ ఇన్నింగ్స్​ సమయంలో.. చివరి ఓవర్లో అర్జున్ తెందూల్కర్‌ బరిలోకి దిగాడు. ఇక ఆ ఓవర్లో కేవలం 4 పరుగులే ఇచ్చిన అర్జున్.. దానితో పాటు ఓ వికెట్​ను తన ఖాతాలో వేసుకున్నాడు. అద్భుతమైన యార్కర్ లెంగ్త్ డెలీవరీని సంధించి.. హైదరాబాద్ బ్యాటర్ భువిని ఔట్​ చేశాడు. అక్కడే ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ ఆ క్యాచ్‌ను పట్టాడు. దీంతో అర్జున్ తొలి వికెట్ కల నెరవేరింది. అర్జున్ వికెట్ తీయగానే.. కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందంతో అతని వద్దకు పరుగులు తీశాడు. అర్జున్‌ను అభినందిస్తూ స్టేడియంలో కేరింతలు కొట్టాడు. ప్రస్తుతం ఆ వీడియోను చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

అయితే ఐపీఎల్‌ వేదికపై తన ప్రతిభను ప్రదర్శించేందుకు అర్జున్​ తెందూల్కర్ ఎంతో కాలం నిరీక్షించాడు. ముంబయి ఇండియన్స్ వేలంలో అతన్ని కొనుగోలు చేసినప్పటికీ తుది జట్టులో మాత్రం అతనికి అవకాశం రాలేదు. దీంతో దాదాపు రెండేళ్ల నిరీక్షణ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌తో మైదనంలోకి అడుగుపెట్టాడు. అయితే ఆ మ్యాచ్‌లో అతడు వికెట్లు తీయలేదు. కానీ తన రెండో మ్యాచ్‌లో మాత్రం తక్కువ పరుగులను సమర్పించడమే కాకుండా ఐపీఎల్‌లో తన మొదటి వికెట్‌ను తీసి ఇప్పుడు అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు.

ABOUT THE AUTHOR

...view details