సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో(SRH vs RCB 2021) ఆఖర్లో ఆ జట్టు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, తమని భారీ షాట్లు ఆడనివ్వకుండా నిలువరించారని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli News) అన్నాడు. బుధవారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ నాలుగు పరుగుల తేడాతో బెంగళూరుపై అద్భుత విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ మాట్లాడుతూ చివర్లో తమని హైదరాబాద్ బౌలర్లు భారీ షాట్లు ఆడనివ్వకుండా అడ్డుకున్నారని చెప్పాడు.
సన్‌రైజర్స్ ఆధిపత్యం చూపింది
"మేం వీలైనంత త్వరగా మ్యాచ్‌ను పూర్తి చేయాలనుకున్నాం. ఇలాంటి స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లను ఆఖరివరకూ తీసుకెళ్లాలనుకోలేదు. కానీ, ఆరంభంలోనే రెండు, మూడు వికెట్లు కోల్పోవడం వల్ల ఇన్నింగ్స్‌ను తిరిగి నిలబెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అయితే, మ్యాక్స్‌వెల్ రనౌట్ కావడమే ఈ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారింది. మరోవైపు డివిలియర్స్ క్రీజులో ఉన్నంతవరకూ మేం పోటీలో ఉన్నామనే అనుకున్నాం. తొలుత బౌలింగ్‌లో బాగా రాణించినా బ్యాటింగ్‌లోనే సరైన ప్రదర్శన చేయలేకపోయాం. చివర్లో షాబాజ్ అహ్మద్ (14) విలువైన పరుగులు చేశాడు. ఇది స్వల్ప స్కోర్ల మ్యాచ్ అయినా సన్‌రైజర్స్ చివరిబంతి వరకూ పోరాడింది. ఆఖర్లో వాళ్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి మమ్మల్ని భారీ షాట్లు ఆడనివ్వకుండా అడ్డుకున్నారు. మాది ప్రొఫెషనల్ జట్టు అయినందున గెలుపోటములను సమానంగా స్వీకరిస్తాం. ఒక్కోసారి ఇలాంటి ఓటములు ఎదురవుతుంటాయి. అయినా, మేం ముందుకు సాగుతుంటాం. అలాగే ఈ ఐపీఎల్ టోర్నీ ప్రతి సంవత్సరం కొత్త ఆటగాళ్ల ప్రతిభను వెలుగులోకి తెస్తుంది. ఉమ్రాన్ మాలిక్ లాంటి యువకుడు 150 కిమీ వేగంతో బౌలింగ్ చేయడం బాగుంది. ఫాస్ట్ బౌలర్లు ఇలా రాణించడం టీమ్‌ఇండియా క్రికెట్‌కు శుభపరిణామం" అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.