తమను స్వదేశానికి తీసుకెళ్లడానికి ప్రత్యేక చార్టర్డ్ విమానం ఏర్పాటు చేయాలని ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్ లీన్.. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)ను కోరాడు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఐపీఎల్ టోర్నీపైనా పడింది. ఇప్పటికే నలుగురు ఆటగాళ్లు టోర్నీ నుంచి నిష్క్రమించారు. వీరిలో ఆసీస్ ఆటగాళ్లు ఆండ్రూ టై, కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా ఇప్పటికే లీగ్‌ను వీడారు. ఈ నేపథ్యంలో మిగిలిన ఆసీస్ ప్లేయర్లకు.. టోర్నీ ముగిసిన వెంటనే సురక్షితంగా స్వదేశం చేరేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాల్సిందిగా క్రిస్ లీన్.. క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడు.
"ఏటా ఐపీఎల్ ఒప్పందంలో భాగంగా క్రికెట్ ఆస్ట్రేలియా 10 శాతం మొత్తాన్ని చార్టర్డ్ విమానం కోసం ఖర్చు చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరాను. ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉందని తెలుసు. అయితే మేము కఠిన నియమ నిబంధనలు కలిగిన బబుల్‌లో ఉన్నాం. వచ్చే వారం వ్యాక్సిన్ కూడా తీసుకుంటాం. ప్రభుత్వం ప్రత్యేక విమానంలో మమ్మల్ని స్వదేశానికి అనుమతిస్తుందని అనుకుంటున్నాం" అని క్రిస్ లీన్ అభిప్రాయపడ్డాడు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించిన నేపథ్యంలో లీన్ ఇలా అభ్యర్థించాడు.
ఇదీ చదవండి:'వచ్చే వారంలో క్రికెటర్లకు వాక్సిన్!'