లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పేసర్ ఆవేశ్ ఖాన్ ప్రస్తుతం తన చర్యతో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. అతడు చేసిన పనివల్ల ఐపీఎల్ నిర్వాహకులు కూడా మందలించారు.
ఇంతకీ ఇతడు చేసిన పనేంటంటే.. ఐపీఎల్లో భాగంగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో లఖ్‌నవూ జట్టు అనూహ్య విజయాన్ని సాధించింది. ఇక ఈ ఆనందాన్ని తట్టుకోలేక రాహుల్ సేన మైదానంలోనే సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో క్రీజులో ఉన్న ఆవేశ్ ఖాన్ హెల్మెట్ నేలకేసి కొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. అలా ఆర్సీబీ ఫ్యాన్స్.. ఈ వీడియోను చూసి అతడికి చురకలు అంటించడం ప్రారంభించారు."కనీసం బంతినే టచ్ చేయలేకపోయావు.. నీకు అంత ఓవరాక్షన్ అవసరమా" అంటూ ఆవేశ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక ఈ దృశ్యాలు చూసి రంగంలోకి దిగిన ఐపీఎల్ నిర్వాహకులు ఆవేశ్ ప్రవర్తనపై మందలిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. "ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ప్లేయర్ ఆవేశ్ ఖాన్‌ను మందలిస్తూ ఈ ప్రకటనను జారీ చేస్తున్నాము. మిస్టర్ ఆవేశ్.. ఐపీఎల్ కోడ్‌లోని 2.2 నిబంధనను అతిక్రమించాడు". అని పేర్కొన్నారు. అయితే మొదటి తప్పిదం అయినందున ఈ సారి మందలింపుతో సరిపెడుతున్నట్లు వెల్లడించారు.
కాగా ఈ మ్యాచ్‌లో అవేశ్ ఖాన్.. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 53 పరుగులును సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్లో స్కోరు సమం అయిన సందర్భంలో చివరి బంతిని కొట్టకుండా మిస్ చేశాడు. అదే సమయంలో ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ కూడా రనౌట్ చేయడంలో విఫలమవ్వడం వల్ల ఆవేశ్ 'బై' రన్ చేశాడు. దీంతో విజయం లఖ్‌నవూ సొంతమైంది.
గంభీర్ పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఫైర్..
ఆవేశ్ ఖాన్‌తో పాటు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్‌ను కూడా ఆర్సీబీ అభిమానులు నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. లఖ్‌నవూ టీమ్ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఆర్సీబీని టీమ్‌ను ఉత్సాహపరించేందుకు అభిమానులు అరుస్తున్నారు. ఆ సమయంలో ఆ జట్టు ఫ్యాన్స్‌ను ఉద్దేశించి.. "ఇక ఆపండి" అన్నట్లు.. నోటిపై వేలును ఉంచి సైగ చేశాడు గంభీర్. అంతే ఇప్పుడీ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఇక మిగతా ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ వీడియోపై స్పందించారు. "గంభీర్ నీ స్థాయికి తగ్గట్టు కాస్త హుందాగా ప్రవర్తించు" అంటూ ఈ టీమ్ఇండియా మాజీ ప్లేయర్‌ను ట్రోల్ చేస్తున్నారు. అయితే గంభీర్ ఫ్యాన్స్ మాత్రం ఆయన చేసిన విషయంలో తప్పేం లేదంటూ సమర్థిస్తున్నారు. 'సెలబ్రేషన్స్‌ను ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు' అని అంటున్నారు.