తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రాసిపెట్టుకోండి.. వచ్చేసారి రూ.లక్ష కోట్లు పక్కా' - లలిత్ మోదీ ఐపీఎల్

IPL Media Rights: ఐపీఎల్​ మీడియా హక్కుల విలువ డబుల్​ అవుతుందని తాను ఎప్పుడో చెప్పానని అన్నారు లలిత్​ మోదీ. వచ్చేసారి రూ.లక్ష కోట్లు పక్కా వస్తాయని, రాసిపెట్టుకోండని చెప్పారు. మరోవైపు, ప్రతి ఐపీఎల్​ ఫ్రాంచైజీ.. ఒక్క మహిళా జట్టుని కలిగి ఉండాలని అన్నారు.

IPL Media Rights Lalith Modi
IPL Media Rights Lalith Modi

By

Published : Jun 19, 2022, 8:37 PM IST

IPL Media Rights Lalith Modi: నానాటికీ తన విలువను పెంచుకుంటూపోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఇటీవలే ముగిసిన మీడియా రైట్స్ ద్వారా ఏకంగా రూ.48,390 కోట్లను ఆర్జించింది. అయితే ఇది ట్రైలరేనని.. తర్వాత సైకిల్ (2027-31)లో మీడియా హక్కుల ద్వారా ఐపీఎల్ లక్ష కోట్ల రూపాయలు ఆర్జించడం ఖాయమని ఈ లీగ్ సృష్టికర్త లలిత్ మోదీ కుండబద్దలు కొట్టి చెప్పారు.

2023-27 కాలానికి గాను మీడియా రైట్స్ ద్వారా బీసీసీఐ భారీగా ఆర్జించిన నేపథ్యంలో లలిత్ మోదీ స్పందించారు. తాజాగా ఓ జాతీయ ఛానెల్​తో ఆయన మాట్లాడుతూ.."ఐపీఎల్ విలువ నానాటికీ పెరుగుతోంది. 2008 నుంచి మీరు నా ఇంటర్వ్యూలు చూస్తే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఐపీఎల్ మీడియా హక్కుల విలువ డబుల్ అవుతుందని నేనెప్పుడో చెప్పా. గత సైకిల్ కంటే ఈసారి (2023-27 కాలానికి) అది 98 శాతం పెరిగింది. ఇక ఆ తర్వాత రాబోయే సైకిల్​కు దాని విలువ డబుల్(రూ.లక్ష కోట్లు) అవుతుంది" అని అన్నారు.

లలిత్ మోదీ.. మహిళా ఐపీఎల్​పై కూడా స్పందించారు. "ప్రతి ఐపీఎల్ ఫ్రాంచైజీ ఒక మహిళా జట్టును కలిగి ఉండాలి. దీనివల్ల భారత మహిళా క్రికెట్ బలం పెరుగుతుంది. ఐపీఎల్ ద్వారా చక్కగా డబ్బులు సమకూర్చుకుంటున్న ఫ్రాంచైజీల యజమానులు మహిళా క్రికెట్​పైన అప్పుడే పెట్టుబడులు పెడతారు" అని లలిత్ మోదీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. 2008లో ఐపీఎల్​ను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించిన లలిత్ మోదీ.. 2010 వరకు ఈ లీగ్​కు ఛైర్మన్​గా వ్యవహరించారు. అయితే 2005-2010 మధ్య బీసీసీఐకి ఉపాధ్యక్షుడిగా ఉన్న కాలంలో అతడు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడం వల్ల 2013లో బీసీసీఐ ఆయనపై జీవితకాల నిషేధం విధించింది.

ఇవీ చదవండి:టెన్నిస్‌ స్టార్‌కు యువతి మ్యారేజ్​ ప్రపోజల్​.. కోర్టులోనే..!

ఒకే జట్టులో కోహ్లీ, బాబర్..? సూపర్​ సిరీస్​కు రంగం సిద్ధం!

ABOUT THE AUTHOR

...view details