Kuldeep Sen IPL: సీజన్-15లో లఖ్‌నవూ-రాజస్థాన్ మధ్య మ్యాచ్.. గెలవాలంటే ఆఖరి ఓవర్లో లఖ్‌నవూ 15 పరుగులు చేయాల్సి వచ్చింది.. ఓ కొత్త కుర్రాడి చేతిలో బంతి.. ఎదురుగా హర్డ్ హిట్టర్ స్టాయినిస్. అప్పటికే సిక్సర్ల మోత మోగిస్తున్న స్టాయినిస్ అలవోకగా లఖ్‌నవూను గెలిపించేస్తాడనుకున్నారంతా. కానీ రాజస్థాన్‌దే విజయం. దీనికి కారణం ఆ కుర్రాడి ప్రతిభే. అరంగేట్రంలోనే ఒత్తిడిలో మ్యాచ్‌లో అదరగొట్టిన ఆ యువ బౌలరే కుల్‌దీప్ సేన్. ఇప్పటిదాకా ఎవరికీ తెలియని ఈ మధ్యప్రదేశ్ పేసర్ ఒక్క ఓవర్‌తో అందరి దృష్టిలో పడ్డాడు. ఈ గుర్తింపు అతడికి చాలా అవసరం. ఎందుకంటే..?
తండ్రి బార్బర్.. ఐపీఎల్లో మెరిసిన తనయుడు.. ఎవరా కుల్‌దీప్?
Kuldeep Sen IPL: తండ్రి మధ్యప్రదేశ్‌లోని రెవాలో చిన్న క్షౌరశాల నడుపుతుంటాడు. తనయుడు ఐపీఎల్లో తన బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. అతడే రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు కుల్‌దీప్ సేన్. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో ప్రత్యర్థిని కట్టడి చేసి అందరి దృష్టిలో పడిన సేన్ గురించే ఈ కథనం.. తెలుసుకుందాం..
కుల్‌దీప్ తండ్రి రామ్‌పాల్ సేన్ మధ్యప్రదేశ్‌లోని రెవాలో ఓ చిన్న క్షౌరశాల నడుపుతుంటాడు. తనయుడు క్రికెటర్ అవుతాను అంటే ప్రోత్సహించే పరిస్థితి కాదతనిది. అందుకే క్రికెట్ ఆడటం వల్ల చాలాసార్లు కుల్‌దీప్ దెబ్బలు కూడా తిన్నాడు. అయితే మధ్యప్రదేశ్‌కే చెందిన మాజీ అండర్-19 పేసర్ అరిల్ ఆంథోని పరిచయం కావడం కుల్‌దీప్‌కు కలిసొచ్చింది. ఈ కుర్రాడిలో ప్రతిభను గుర్తించిన ఆంథోని అతడికి ఆర్థికంగా సాయం చేసి ఎదిగేలా ప్రోత్సహించాడు. ఎంఆర్‌ఎఫ్ ఫౌండేషన్‌లో దిగ్గజ పేసర్ డెన్నిస్ లిల్లీ దగ్గర నేర్చుకున్న చిట్కాలనే కుల్‌దీప్‌కు చెప్పాడు. కుల్‌దీప్ కుటుంబ పరిస్థితి చూసి ఫీజు కూడా తీసుకునే వాడు కాదు. ఆరంభంలో సరైన బౌలింగ్ యాక్షన్ కుదరక ఇబ్బంది పడ్డ కుల్‌దీప్ ఆ తర్వాత గాడిలో పడి లైన్ అండ్ లెంగ్త్‌లో స్థిరంగా బంతులేసే బౌలర్‌గా మారాడు. అంతేకాదు 2018-19 రంజీ సీజన్లో మధ్యప్రదేశ్ తరఫున అరంగేట్రం చేశాడు. 150 కి.మీ వేగంతో బంతులు వేసే సామర్థ్యం ఉన్న పేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ పేసర్.. రంజీల్లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ సామర్థ్యమే అతడిని టోర్నీలో రాజస్థాన్ జట్టుకు ఎంపికయ్యేలా చేసింది.