తెలంగాణ

telangana

ETV Bharat / sports

సన్​రైజర్స్​పై కోల్​కతా నైట్​రైడర్స్​ విజయం

హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో కోల్​కతా విజయం సాధించింది. 188 పరుగుల లక్ష్య ఛేదనలో వార్నర్ సేన 177 పరుగులకే పరిమితమైంది. కోల్​కతా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 2, షకిబుల్​ హసన్, కమిన్స్, రస్సెల్​​ తలో వికెట్ తీసుకున్నారు.

Kolkata Knight Riders beat Sunrisers Hyderabad
హైదరాబాద్​పై గెలుపుతో బోణీ కొట్టినా కోల్​కతా

By

Published : Apr 11, 2021, 11:04 PM IST

Updated : Apr 11, 2021, 11:24 PM IST

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడిన తొలిపోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమిపాలైంది. 10 పరుగుల తేడాతో కోల్‌కతా గెలిచింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు మాత్రమే చేసింది. భారీ ఛేదనలో ఆదిలోనే ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(3), వృద్ధిమాన్‌ సాహా(7) వికెట్లు కోల్పోయిన కోల్పోయిన హైదరాబాద్‌ తర్వాత తిరిగి పుంజుకుంది. మనీశ్‌ పాండే(61*; 44 బంతుల్లో 2x4, 3x6), జానీ బెయిర్‌స్టో(55; 40 బంతుల్లో 5x4, 3x6) అర్ధశతకాలతో రాణించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 92 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.

అయితే, కీలక సమయంలో బెయిర్‌స్టో ఔటవ్వడంతో హైదరాబాద్‌ స్కోర్‌ వేగం తగ్గింది. ఆపై వచ్చిన మహ్మద్‌ నబీ(14), విజయ్‌ శంకర్‌(11) కూడా విఫలమయ్యారు. చివర్లో సమద్‌(19; 8 బంతుల్లో 2x6) రెండు సిక్సులు సాధించినా అప్పటికే రన్‌రేట్‌ పెరిగిపోవడంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. కోల్‌కతా బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ రెండు వికెట్లు తీయగా షకిబ్‌, రసెల్‌, కమిన్స్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టాస్‌ఓడి బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌(15) విఫలమైనా.. నితీశ్‌ రాణా(80; 56 బంతుల్లో 9x4, 4x6), రాహుల్‌ త్రిపాఠి (53; 29 బంతుల్లో 5x4, 2x6) అర్ధశతకాలతో మెరిశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 93 పరుగులు జోడించారు. అయితే, శతక భాగస్వామ్యం వైపు దూసుకుపోతున్న వీరిని నటరాజన్‌ విడదీశాడు. రాహుల్‌ను ఔట్‌ చేయడంతో కోల్‌కతా స్కోర్‌ 146/2గా నమోదైంది. ఆపై వెనువెంటనే మరో మూడు వికెట్లు పడటంతో కోల్‌కతా పరుగుల వేగానికి బ్రేక్‌ పడింది. రాణా, రసెల్‌(5), మోర్గాన్‌(2) వరుసగా పెవిలియన్‌ చేరారు. చివర్లో దినేశ్‌ కార్తీక్‌ (22; 9 బంతుల్లో 2x4, 1x6) బౌండరీలు బాదడంతో కోల్‌కతా భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో నబీ, రషీద్‌ ఖాన్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. నటరాజన్‌, భువనేశ్వర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్‌ సాధించిన నితీశ్‌ రాణాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

Last Updated : Apr 11, 2021, 11:24 PM IST

ABOUT THE AUTHOR

...view details